Saturday, July 27, 2024

2 నెలల్లో రుణ మాఫీ మొదలు

- Advertisement -
- Advertisement -

loan waiver

 

రైతుబంధుపై పరిమితులకు సిఎం అంగీకరించలేదు
ఆర్థిక మాంద్యం ఉంది.. రబీ పెట్టుబడి సాయం ఆలస్యం
త్వరలోనే కేంద్రమంత్రిని కలిసి పసుపు మద్దతుపై మాట్లాడుతాం
మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: రానున్న రెండు నెలల్లో రుణమాఫీ అమలు ప్రారంభమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుబంధుపై పరిమితులపై వ్యవసాయ శాఖ కొన్ని ప్రతిపాదనలు చేసినప్పటికీ సిఎం కెసిఆర్ వాటికి అంగీకరించలేదని తెలిపారు. ఖరీఫ్ రైతుబంధు పంపిణీ ఆరు శాతమే మిగిలి ఉందని, 94 శాతం మందికి ఇచ్చామని వెల్లడించారు. ఇప్పుడిప్పుడే కరిగట్టు అయి రబీ సాగు మొదలైందని, ఆర్థిక మాంద్యం ఉన్నందున రెండు రోజులు అటో ఇటో రబీ రైతుబంధు చెల్లిస్తామని చెప్పారు. రైతులు పంట రుణాలు రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు.

సోమవారం హాకాభవన్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతుల కష్టాన్ని తగ్గించి తెలివి తేటలను మార్కెటింగ్ కోసం ఉపయోగించుకునేలా పని ముట్లను క్షేత్రస్థాయిలో పెట్టగలిగితే తెలంగాణ ముఖచిత్రం మారుతుందనిన్నారు. రాష్ట్రంలో కూలీల కొరత వేదిస్తోందని, ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అవసరమైనంత మేరకు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ షార్ట్‌ఫాల్ ఉందని, ఫామ్ మెకనైజేషన్‌కు వందశాతం గ్రాంట్‌లపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కలుస్తామని చెప్పారు. అమెరికాలో వ్యవసాయం 33శాతం నుంచి 3శాతానికి పడిపోయిందని, ప్రపంచ ఆహార అవసరాలను భారత్ తీర్చగలిగే స్థాయికి ఎదిగి నంబర్ వన్‌గా మారుతుందన్నారు.

వెనిషాన్ బ్రాండ్‌తో విక్రయాలు
ఫామ్ మెకనైజేషన్, మార్కెట్ ఇంటర్వెన్షన్ యాక్టివిటీ, క్రాప్ కాలనీలు, ఫుడ్ ప్రాసెసింగ్, రైతు సమన్వయ సమి తి వంటి కార్యక్రమాల బలోపేతం చేయడానికి వచ్చే బడ్జెట్‌లో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఖరీఫ్‌లో రాష్ట్రంలో అంచనాలకు మించి ఒక కోటి 22లక్షల66వేల ఎకరాల్లో సాగైందని తెలపారు. సాయి ల్ హెల్త్, పంటకాలనీలపై దృష్టిపెట్టామని తెలిపారు. రైతులకు మినిమమ్ గ్యారెంటీ ఉండేలా పథకాలను రూపొందిస్తున్నామన్నారు. రసాయనిక ఎరువుల వినియోగంతో దిగుబడి తగ్గడంతో పాటు నేల నిస్సారం అవుతోందన్నారు. పుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా వెనిషాన్ బ్రాండ్ పేరుతో మహిళ రైతులతో మొదటిదశ ప్రాజెక్టును ప్రారంభించామని, త్వరలోనే దాని ఫలాలు చూస్తారన్నారు. జయశంకర్ యూనివర్సిటీని మొదటి స్థానానికి తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఆయిల్‌పామ్‌కు భవిష్యత్
కేంద్రం నూనె గింజల సీడ్స్ పెంచాలని నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో వేరుశనగ ఉత్పత్తిలో అగ్రభాగంలో ఉన్న వనపర్తి జిల్లాలో ప్రత్యేక వేరుశనగ రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. 2020లో అయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం అందించనున్నామన్నారు. 240 మండలాల్లో అయిల్‌పామ్ సాగుకు అనుకూలమైనవని కేంద్రం తేల్చిందన్నారు. 7 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అయిల్‌పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలపారు. గతంలో మూసి వేసిన బీచుపల్లి ఆయిల్ మిల్‌ను తెరిచామని, దీన్ని పామ్ ఆయిల్ క్రషింగ్‌కు వినియోగిస్తామన్నారు. రాష్ట్రంలో 40 నుంచి 50 వరకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయన్నారు.

నిజామాబాద్ ఎంపి మాట నిలబెట్టుకోలేదు
పసుపు బోర్డు తీసుకువస్తానని హామీతో అగ్రిమెంట్ రాసిచ్చిన ఎంపి ఆర్వింద్ హామీని నిలపెట్టుకోలేదని, అం దుకే అక్కడ రైతులు ఉద్యమిస్తున్నారని తెలిపారు. ఎన్నికలపుడు మాట ఇచ్చి తప్పే పార్టీ తమది కాదన్నారు. పసుపుకు మద్దతు ధర కోసం కేంద్రానికి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. కల్తీ లేని నాణ్యమైన ఆహారం సమాజానికి అందాలన్నది సిఎం ఆలోచనగా చెప్పారు. క్యాల్షియం క్బాడ్ వంటి విషపూరిత నిషేధిత పదార్థాల ద్వారా పండ్లను మాగబెట్టడానికి ప్రత్యామ్నాయంగా ఆమోదించిన ఎన్ రైప్ ఉత్పత్తులను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా విత్తనాభివృద్ధి సంస్థ డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారధి, కమిషనర్ రాహుల్ బొజ్జా, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్‌ట్రామ్‌రెడ్డి, వి.సి ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.

Start loan waiver in 2 months
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News