Monday, May 27, 2024

ఆత్మాభిమానం నుంచి ఆత్మన్యూనతలోకి

- Advertisement -
- Advertisement -

పార్లమెంటుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట శాసనసభకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. స్థానికంగా తమ మధ్య ఎన్ని రాజకీయ విభేదాలున్నా రాష్ర్టంలోని మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలు కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. దానికి వీర విధేయులుగా కొనసాగుతున్నాయి. ప్రధాన పోటీదారుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచన ఏ కోశానా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కున్న విశిష్టమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వానికి ఇది పూర్తి విరుద్ధంగా ఉంది. ఎన్నో రాజకీయ, సామాజిక, సంస్కరణ ఉద్యమాలకు ఊపిరి పోసిన ప్రాంతంగా ఈ రాష్ట్రానికి ఒక ఘనమైన చరిత్ర ఉంది. ఏ ఆధిపత్యాన్నీ అంగీకరించని ఆత్మాభిమానం కల ధిక్కారస్వరం వినిపించిన ప్రాంతంగా దీనికి ఒక గుర్తింపు ఉంది. అలాంటి ఈ రాష్ర్టంలో కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి సమాజాన్ని, రాజకీయాలను శాసిస్తున్న ప్రాంతీయ పార్టీల తీరును గమనిస్తుంటే ఆత్మాభిమానాన్ని జారవిడుచుకుంటూ ఆత్మన్యూనతలోకి జారిపోతున్నట్టు కనిపిస్తోంది.ఆంధ్రపదేశ్‌లో ఏమాత్రం సొంత బలంలేని ఢిల్లీ పాదుషా కనుసన్నల్లోనే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ నడుస్తూ ప్రజల్ని నడిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇతరుల ఆధిపత్యాన్ని ధిక్కరించిన ఒక చారిత్రక నేపథ్యం ఉంది. దశాబ్దాల పాటు ఉమ్మడి మద్రాసు రాష్ర్టంలో భాగంగా కొనసాగిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యోగాల్లో, ఉపాధిలో, సాంస్కృతిక జీవనంలో తమిళుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ పోరాటంలో తమ ఉనికి కోసం సంఘటితమవ్వడానికి ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేసుకున్నారు. బాపట్లలో 1913లో ఏర్పాటు చేసిన తొలి ఆంధ్ర మహాసభలోనే ప్రత్యేక రాష్ర్ట ఆలోచనకు బీజం పడింది. విశాఖపట్నంలో 1915లో జరిగిన తృతీయ ఆంధ్ర మహాసభలో ప్రత్యేక తెలుగు రాష్ర్టం కోసం తీర్మానం చేశారు. దీనికి సుముఖంగా లేని రాయలసీమ నాయకులను బుజ్జగించి, వారితో శ్రీభాగ్ ఒడంబడికను చేసుకున్నారు. విజయవాడలో జరిగిన ఆంధ్ర మహాసభ రజతోత్సవ సభలో రాయలసీమ నాయకులను ఏనుగులపైన ఊరేగించి, సంభావనలు సమర్పించి, వారితో సఖ్యత ఏర్పాటు చేసుకుని తెలుగు వారి ఆత్మాభిమానం కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ర్ట సాధనకు నడుం బిగించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాటి ప్రధాని నెహ్రూ వ్యతిరేకమైనప్పటికీ అందుకు నిరసనగా పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి, కేంద్ర ప్రభుత్వం ముఖాన తన ప్రాణాన్ని విసిరికొట్టాడు. దీంతో ఆంధ్ర ప్రాంతమంతా అట్టుడికిపోయింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ర్ట ఏర్పాటు అనివార్యమైంది. స్వాతంత్య్రానంతరం తొలి భాషా ప్రయుక్త రాష్ర్టంగా 1953లో ఆంధ్ర రాష్ర్టం అవతరించి, తన ఆత్మాభిమానాన్ని చాటుకుంది.

ధవళేశ్వరం వద్ద 1852లో ఆనకట్ట కట్టగా, విజయవాడ వద్ద 1855లో ప్రకాశం బ్యారేజ్‌ని నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతం సస్యశ్యామలమవ్వడంతో కోస్తాంధ్ర ప్రాంతంలోని ప్రజల ఆర్థిక స్తోమత ఒక మేరకైనా పెరిగింది. రాయలసీమలో కెసి కెనాల్ నిర్మించడం ద్వారా కొంత ప్రాంతానికైనా నీటిని అందించగలిగారు. ఇవ్వన్నీకూడా బ్రిటిష్ కాలంలో జరిగినవే. జి.ఎస్ టేలర్ ‘రేట్ పాఠశాలలు’ ప్రవేశపెట్టారు. వీటితో ఆధునిక విద్య మొదలై కొత్త ఆలోచనలకు ద్వారాలు తెరుచుకున్నాయి. దీనికి ముందే ఏనుగుల వీరాస్వామి రాసిన ‘కాశీయాత్ర’లో సాంఘిక దురాచారాలను ప్రస్తావించారు. అందులో అస్పృశ్యత, కుల వ్యత్యాసాలు సమర్థించదగ్గవి కావన్నారు. అగ్రవర్ణాల ఆధిపత్యం మతాంతీకరణకు దారితీశాయి. బాల్య వివాహాలకు, కన్యాశుల్కానికి వ్యతిరేకంగా గురజాడ చేసిన రచనలు ఆంధ్ర సమాజంపైన చాలా ప్రభావాన్ని కలగచేశాయి. రాజారామ్మోహన్ రాయ్ స్ఫూర్తితో ప్రార్థనా సమాజాన్ని బ్రహ్మ సమాజంగా కందుకూరి వీరేశలింగం మార్చా రు. బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు.

గిడుగు రామ్మూర్తి వ్యవహారికీ భాషా ఉద్యమాన్ని తీసుకొచ్చారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరి పోశారు. ఆయన సతీమణి రమాబాయి 1920 ప్రాంతంలోనే మహిళల కోసం ‘సౌందర్యవల్లి’ అన్న పత్రికను నడిపి, స్త్రీలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలని ఆనాడే కోరింది. రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆర్యసమాజాన్ని స్థాపించి దేవదాసీ వ్యవస్థకు, మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడారు. తమిళనాడులో పెరియార్ రామస్వామి ఆధ్యర్యంలో బ్రాహ్మ ణ ఆధిపత్య వ్యతిరేకోద్యమం చాలా బలంగా వేళ్ళూనుకుంది. అంత తీవ్రస్థాయిలో కాకపోయినా ఆంధ్ర ప్రాంతంలో కూడా త్రిపురనేని రామస్వామి చౌదరి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని లేవదీశారు. కానీ అది తమిళనాడులో లాగా నిలదొక్కుకోలేకపోయింది. గోరా నాయకత్వంలో నాస్తికోద్యమం స్త్రీ విద్యా వ్యాప్తికి, దీనజనోద్ధరణకు, శాస్త్రీయ భావనలకు కృషి చేసింది. ఈ సంస్కరణ ఉద్యమాలన్నీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, ఆత్మాభిమానం కోసం వచ్చినవన్న విషయం మర్చిపోకూడదు. జాతీయోద్యమం మొదలవడంతో ఈ సంస్కరణ ఉద్యమాలన్నీ కాస్త నెమ్మదించినప్పటికీ, జాతీయోద్యమానికి పూర్వరంగాన్ని ఏర్పాటు చేశాయి. ఒక సాంస్కృతిక పునరుజ్జీవనానికి దారితీశాయి.

అల్లూరి సీతారామరాజు గిరిజనులను కూడగట్టి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. స్వాతంత్య్రోద్యమంలో టంగుటూరి ప్రకాశం పంతు లు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఎన్.జి.రంగా లాంటి ఆంధ్ర ప్రాంత నాయకులు జాతీయ స్థాయిలో నిర్వహించిన పాత్ర తక్కువేమీకాదు. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లో కూడా చాలా మంది తెలుగు వాళ్ళు చేరారు. జాతీయోద్యమంలో పుచ్చల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి వంటి త్యాగధనులపాత్ర ఇంతా అంతా కాదు. పొరుగునే ఉన్న నిజాం సంస్థానానికి, అక్కడి భూస్వామ్య దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆంధ్రప్రాంత నాయకులు కీలకపాత్ర పోషించారు. ఈ పోరాట సమయం లో నిర్బంధం పెరిగినప్పుడు ఆ యోధులకు ఆంధ్రప్రాంతం ఆశ్రయం కల్పించింది. ఆ ఉద్యమ నాయకత్వంలో కీలక పాత్ర పోషించి, అనేక నిర్బంధాలను ఎదుర్కొంది. తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా ఆంధ్ర ప్రాంతంలో కూడా కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించారు. ప్రాణాలను పణంగా పెట్టి అనేక నిర్బంధాలను ఎదుర్కొన్న ఆంధ్రప్రాంత నాయకులు తెలంగాణ సాయుధ పోరాటానికి బాసటగా నిలిచారు. సంస్కరణ ఉద్యమాలు, జాతీయోద్యమం, ప్రత్యేక ఆంధ్ర రాష్ర్టం ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం సహా అన్ని ఉద్యమాలూ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆత్మాభిమానం కోసం జరిగిన పోరాటాలేనన్న సంగతి మర్చిపోకూడదు.

గతమెంతో ఘనకీర్తి వర్తమానం అపకీర్తి

తెలంగాణ సాయుధ పోరాటం రెండు తెలుగు రాష్ట్రాల వారిని దగ్గర చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి మార్గాన్ని సుగమం చేసింది. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ అన్న నినాదాన్ని నాటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు తీసుకొచ్చారు. హైదరాబాదు రాజధానిగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు, తెలంగాణ ఆత్మాభిమానానికి సంబంధించిన కొన్ని భయాలు, నిరసన గళాలు అప్పుడే వినిపించాయి. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. రాయలసీమ నాయకులతో ఆంధ్ర నాయకులు చేసుకున్న శ్రీభాగ్ ఒడంబడికను అమలు చేయడంలో నిర్లక్ష్యం జరిగిందని రాయలసీమ వాసుల్లో ఒక అసంతృప్తి ఇప్పటికీ గూడుకట్టుకునే ఉంది. బలహీనంగానైనా అప్పుడప్పుడూ అది బయటపడుతూనే ఉంది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా తెలంగాణకు నీటి విషయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆప్రాంత వాసుల్లో ఉన్న అసంతృప్తి ఒక్క సారిగా పెల్లుబికింది. ఉమ్మడి రాష్ర్టంగా పుష్కర కాలం పూర్తికాగానే 1969లో ‘జై తెలంగాణ’ పేరుతో ప్రత్యేక రాష్ర్ట ఉద్యమం ఊపందుకుంది.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News