Tuesday, April 30, 2024

చీకటి రోజు

- Advertisement -
- Advertisement -

1919, ఏప్రిల్ 13 భారత దేశ చరిత్రలో దుర్దినం. బ్రిటిష్ పాలకుల దమనకాండకు పరాకాష్ఠగా, చరిత్ర సాక్ష్యంగా నిలిచిన చీకటి దినం. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటన జలియన్ వాలాబాగ్ ఉదంతం. నాటి బ్రిటిష్ పాలకుల చర్యలకు వందలాది మంది అమాయకులు ప్రాణా లు కోల్పోయిన నేపథ్యం. శతాబ్ద కాలం గడిచినా చెరగని నెత్తుటి మరకల జ్ఞాపకం. పంజాబ్, బెంగాల్‌లో నానాటికీ పెచ్చరిల్లుతున్న విప్లవోద్యమం. భారత ప్రజల్లో నానాటికీ రగులుతున్న అసంతృప్తి (ముఖ్యంగా బాంబే మిల్ వర్కర్స్‌లో) మొదలైన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బ్రిటిష్ ప్రభుత్వం 1918లో ఆంగ్లేయ న్యాయమూర్తియైన సిడ్నీ రౌలట్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనినే రౌలట్ కమిటీ అంటారు.

రౌలట్ కమిటీ ప్రతిపాదనను అనుసరించి బ్రిటీష్ ప్రభుత్వం 1915లో ఏర్పాటు చేయబడ్డ భారతీయ రక్షణ చట్టానికి అదనంగా రౌలట్ చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ చట్టం ద్వారా తిరుగుబాట్లను అణచివేయడానికి వైస్రాయ్‌లకు విశేష అధికారాలను కట్టబెట్టారు. 1919, ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ లో గల స్వర్ణ దేవాలయం పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్ తోట లో దాదాపు 20 వేల మంది ప్రజలు సమావేశమైనారు. అది వైశాఖ మాసం, సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం. వారు అక్కడ సమావేశమవడానికి ముఖ్యకారణం, ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడం, అనేక విమర్శలకు గురైన రౌలట్ చట్టం క్రింద సత్యపాల్, సైఫుద్ధీన్ కిచ్లూలను అక్రమంగా నిర్బంధించడాన్ని, వారికి ప్రాంత బహిష్కరణ శిక్ష విధించడానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సార్వజనీన సమావేశం.

వివిధ విభాగాలకు చెందిన 90 మంది సైనికులు (ఇండియన్ ఆర్మీ), వారితో బాటు రెండు ఆయుధాలతో కూడిన సురక్షిత వాహనాలు అక్కడికి వచ్చాయి. ఇరుకైన సందుల కారణంగా వాహనాలు బాగ్ లోపలికి రాలేకపోయాయి. జలియన్ వాలా బాగ్ (పార్కు) అన్ని ప్రక్కలా ఇండ్లతోను, పెద్ద భవనాలతోను చుట్టబడి ఉంది. ఉన్న కొద్దిపాటి ఇరుకైన సందుల దారుల్లో చాలా వాటికి తాళాలు వేసి ఉన్నాయి. ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాల పాటు కొనసాగాయి. ఇరుకైన సందుల కారణంగా వాహనాలు బాగ్ లోపలికి రాలేకపోయాయి. కాల్పుల కారణంగా వందల మంది మరణించారు.

1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 (337 పురుషులు, 41 మంది బాలురు, 6 వారాల పసికందు) మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000కి పైగా మరణిం చారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. అక్కడ స్మారక చిహ్నం పైన రాసిన సమాచారం ప్రకారం అక్కడి బావిలోంచి 120 శవాలను బయటకు తీశారు. నగరంలో కర్ఫ్యూ ఉన్నందున గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసికొని వెళ్ళడం సాధ్యం కాలేదు. వేల మంది సామాన్య పౌరులు సమావేశమై ఉండగా పోలీసులతో చుట్టుముట్టి విచ్చలవిడిగా కాల్పులు జరిపి వేలమంది మరణానికి కారణం అయ్యాడు జనరల్ డైయర్. తన ఆఫీసులో బ్రిగేడియర్ జనరల్ రెజినాల్ డయ్యర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అతనికి తిరుగుబాటు విప్లవకారుల సేన ఎదురైనందున కాల్పులు జరుపవలసి వచ్చింది. డయ్యర్‌కు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓడ్వయర్ ఇచ్చిన టెలిగ్రామ్‌లో ‘నీ చర్య సరైనదే. దానిని లెఫ్టినెంట్ గవర్నర్ సమర్ధిస్తున్నాడు’ అని రాసి ఉంది. ఈ ఉదంతంపై విచారణ జరప డానికి 1919లో ‘హంటర్ కమిషన్’ ఏర్పరచారు.

ఆ కమిషన్ సమక్షంలో డయ్యర్ – తనకు ఆ మీటింగ్ గురించి 12:40కి తెలిసిందనీ, దానిని ఆపడానికి తానే విధమైన ప్రయత్నమూ చేయలేదనీ, అక్కడ సమావేశమైన గుంపు గనుక కనిపిస్తే కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళాననీ – చెప్పాడు. బహుశా కాల్పులు జరుపకుండా గుంపును చెదరగొట్టడం సాధ్యం అయ్యుండవచ్చునని నేను భావిస్తున్నాను. కాని వాళ్ళంతా మళ్ళీ తిరిగి వచ్చి నన్ను అవహేళన చేసేవారు. నేను చేతగాని వాడినయ్యుండేవాడిని’ అని -హంటర్ కమిషన్ సమక్షంలో డయ్యర్ పేర్కొన్నాడు. అంతేగాకుండా ఆ స్థలంలోనికి వాహనాలు వెళ్ళగలిగితే తాను మెషిన్ గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని, కాని ఇరుకైన సందులలోకి సాయుధ వాహనాలు వెళ్ళడం కుదరలేదని చెప్పాడు. జనం చెల్లాచెదురైనా గాని కాల్పులు ఆపలేదని, కొద్ది పాటి కాల్పుల వల్ల ప్రయోజనం లేదని, జనం అంతా వెళ్ళిపోయే దాకా కాల్పులు జరపడం తన బాధ్యత అని చెప్పాడు.

గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించడం తన బాధ్యత కాదు గనుక అలాంటి ప్రయత్నమేమీ చేయలేదని, ఆసుపత్రులు తెరచి ఉన్నందున వారే వెళ్ళవచ్చునని కూడా అన్నాడు. భారత దేశంలో దీనికి ప్రతిగా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమ య్యాయి. పంజాబ్‌లో జరుగుతున్న స్వాతంత్య్రోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్, బ్రిటీష్ ప్రభుత్వం తన కిచ్చిన సర్ బిరుదును ఇంగ్లండు ప్రభువుకు తిరిగి ఇచ్చివేశారు. మొత్తమ్మీద ఈ సంఘటన స్వాతంత్య్రోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసింది.

రామకిష్టయ్య సంగన భట్ల
94405 95494

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News