Saturday, July 27, 2024

పతంజలి క్షమాపణకు తిరస్కరించిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పతంజలి ఔషధ ఉత్పత్తులపై తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించి బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ సమర్పించిన ‘బేషరతు క్షమాపణ’ను సుప్రీం కోర్టు బుధవారం తిరస్కరించింది. న్యాయమూర్తులు హిమా కోహ్లి, అహ్సనుద్దీన్ అమానుల్లాహ్‌తో కూడిన ధర్మాసనం పతంజలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. వారి చర్యలు సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులను ‘ఉద్దేశపూర్వకంగా, పదే పదే ఉల్లంఘించినవిగా’ ఉన్నాయని బెంచ్ పేర్కొన్నది. పతంజలి వ్యవస్థాపకుల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ప్రజలు జీవితంలో పొరపాట్లు చేస్తుంటారని అన్నారు. అయితే, సర్వోన్నత న్యాయస్థానం న్యాయవాదిని విమర్శించింది. అటువంటి కేసులలో వ్యక్తులు ఇబ్బంది పడవలసి వస్తుందని బెంచ్ వ్యాఖ్యానించింది.‘మేము కళ్లు మూసుకుని కూర్చోలేదు& మేము ఈ కేసులో ఉదారంగా వ్యవహరించదలచుకోలేదు’ అని బెంచ్ స్పష్టం చేసింది.

బుధవారం విచారణ సమయలో న్యాయవాది రోహత్తి పతంజలి, సంస్థ ఎండి ఆచార్య బాలకృష్ణ, సమర్పించిన రెండు అఫిడవిట్లు, బాబా రామ్‌దేవ్ సమర్పించిన అఫిడవిట్‌ను చదివి వినిపించారు. ‘క్షమాపణ కాగితంపైనే ఉంది. వారి తీరు అందుకు విరుద్ఢంగా ఉంది. దీనిని మేము అంగీకరించేది లేదు. వాగ్దానాన్ని కావాలనే ఉల్లంఘించినట్లుగా మేము దీనిని పరిగణిస్తాం. అఫిడవిట్ తిరస్కరణతో పాటు వేరే చర్యకు సిద్ధంగా ఉండండి’ అని సుప్రీం కోర్టు అన్నది. బెంచ్ బాబా రామ్‌దేవ్‌ను కూడా తూర్పారబట్టింది. విదేశీ పర్యటన ప్లాన్లు ఉన్నందున కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని రామ్‌దేవ్ కోరి అఫిడవిట్‌లో వెనుక తేదీ టిక్కెట్‌ను పొందుపరచినందుకు బెంచ్ ఆక్షేపించింది. ‘కోర్టు ధిక్కరణ వ్యవహారంలో విదేశీ ప్రయాణానికి నాకు ఒక టిక్కెట్ ఉందని చెప్పి మీరు మినహాయింపు కోరి ఆ తరువాత నాకు అది లేదని చెబుతున్నారు. మీరు ఈ ప్రక్రియను చాలా తేలికగా తీసుకుంటున్నారు’ అని బెంచ్ హెచ్చరించింది.

ఈ ఘటనను కోర్టులో ‘అబద్ధపు సాక్షం’గా బెంచ్ పేర్కొన్నది. క్షమాపణ అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించడానికి బదులు ముందుగా బయటకు వెల్లడి చేసినందుకు కూడా పతంజలిని బెంచ్ తప్పు పట్టింది. ‘వారు ముందు మీడియాకు పంపారు. మంగళవారం రాత్రి 7.30 వరకు మా కోసం అప్‌లోడ్ చేయలేదు. వారికి ప్రచారంలో విశ్వాసం ఉందని స్పష్టం అవుతోంది’ అని జస్టిస్ కోహ్లి అన్నారు. పతంజలి ఉత్పత్తులకు లైసెన్స్ ఇచ్చినందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కూడా సుప్రీం కోర్టు తప్పు పట్టింది. ఔషధ లైసెన్సింగ్ అధికారులు ముగ్గురిని వెంటనే సస్పెండ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ‘వారు (పతంజలి) మీకు చేసిన ప్రకటనను ఉల్లంఘించినప్పుడు మీరు ఏమి చేశారు? కూర్చుని బొటనవేళ్లు విరుచుకున్నారా? మిమ్మల్ని మేము బతిమాలేందుకు వేచి ఉన్నారా’ అని జస్టిస్ కోహ్లి ప్రశ్నించారు.

ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ ప్రాధికార సంస్థ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ధ్రువ్ మెహతాను జస్టిస్ అమానుల్లాహ్ ఉద్దేశిస్తూ, అధికారులను ఊరికే వదలిపెట్టేది లేదని హెచ్చరించారు. ‘అధికారులకు ‘విశ్వాసనీయమైన’ పదం వాడడానికి మేము తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నాం. మేము తేలికగా తీసుకోబోవడం లేదు. మిమ్మల్ని వదలిపెట్టం’ అని జస్టిస్ అమానుల్లాహ్ చెప్పారు. సుప్రీంకోర్టు ‘ఇప్పుడు హాస్యాస్పదం’గా మారిందని అంటూ లైసెన్సింగ్ ప్రాధికార సంస్థను బెంచ్ విమర్శించింది. ‘మేము విలాస భవంతులలో కూర్చుంటామని జనం భావిస్తుంటారు. మీ అధికారులను మందలించాలి. మీరు పతంజలితో కుమ్మక్కు అయ్యారు’ అని సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ ప్రాధికార సంస్థ జాయింట్ డైరెక్టర్ మిథిలేశ్ కుమార్ తదుపరి చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 16న ఉంటుంది. తమ ముందు హాజరు కావాలని బాబా రామ్‌దేవ్‌ను, ఆచార్య బాలకృష్ణను సుప్రీం కోర్టు కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News