Sunday, April 28, 2024

అదరగొట్టిన ఫిలిప్స్.. లంకపై కివీస్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

T20 World Cup 2022: NZ Won by 65 runs against SL

సిడ్నీ: టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ మరో భారీ విజయాన్ని అందుకుంది. శనివారం శ్రీలంకతో జరిగిన సూపర్12 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గ్లెన్ ఫిలిప్స్ మెరుపు శతకానికి ట్రెంట్ బౌల్ట్ అద్భుత బౌలింగ్ తోడు కావడంతో కివీస్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో కేవలం 102 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ విజయంతో కివీస్ గ్రూప్1 నుంచి సెమీస్ బెర్త్‌కు మరింత చేరువైంది. ఇక వరుసగా రెండో ఓటమిని చవిచూసిన శ్రీలంక తన సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.
ఆరంభంలోనే షాక్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవోన్ కాన్వేలు జట్టుకు శుభారంభం అందించలేక పోయారు. అలెన్ ఒక పరుగు మాత్రమే చేసి మహీశ్ తీక్షణ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.ఆ వెంటనే కాన్వే కూడా ఔటయ్యాడు. ఒక పరుగు మాత్రమే చేసిన కాన్వేను ధనంజయ డిసిల్వా పెవిలియన్‌కు పంపించాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా విఫలమయ్యాడు. 8 పరుగులు మాత్రమే రజిత చేతికి చిక్కాడు. దీంతో కివీస్ 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.
ఫిలిప్స్ పోరాటం
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను గ్లెన్ ఫిలిప్స్ తనపై వేసుకున్నారు. అతనికి డారిల్ మిఛెల్ అండగా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఫిలిప్స్ స్కోరును ముందుకు నడిపించాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను ఫోర్లు, సిక్సర్లుగా మలుస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. ఫిలిప్స్‌ను కట్టడి చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే సమయంలో ఫిలిప్స్ సహచరుడు మిఛెల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 84 పరుగులు జోడించాడు. మిఛెల్ 22 పరుగులు చేసి హసరంగ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరోవైపు ఫిలిప్స్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు. లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 64 బంతుల్లోనే పది ఫోర్లు, మరో నాలుగు సిక్సర్లతో 104 పరుగులు సాధించాడు. దీంతో కివీస్ స్కోరు 167 పరుగులకు చేరింది.
బౌల్ట్ మాయ..
తర్వాత లక్షఛేదనకు దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. ఓపెనర్ పాథుమ్ నిసాంకా (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. టిమ్ సౌథి అద్భుత బంతితో అతన్ని వెనక్కి పంపాడు. ఆ తర్వాత ట్రెంట్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. తన తొలి ఓవర్‌లోనే బౌల్ట్ కుశాల్ మెండిస్ (4), ధనంజయ డిసిల్వా (0)లను ఔట్ చేశాడు. కొద్ది సేపటికే చరిత్ అసలంక (4)ను కూడా బౌల్ట్ పెవిలియ్‌బాట పట్టించాడు. దీంతో శ్రీలంక 8 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే చమిక కరుణరత్నె (3) కూడా ఔట్ కావడంతో లంక 24 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఈ సమయంలో భానుక రాజపక్స, కెప్టెన్ దాసున్ శనక కొద్ది సేపు పోరాటం కొనసాగించారు. ధాటిగా ఆడిన రాజపక్స 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన శనక 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 పరుగులు చేసి బౌల్ట్ చేతికి చిక్కాడు. ఇక జట్టును ఆదుకుంటారని భావించిన వనిందు హసరంగ (4), మహీశ్ తీక్షణ (0), లహిరు కుమార (4) కూడా విఫలం కావడంతో లంక ఇన్నింగ్స్ 102 పరుగుల వద్దే ముగిసింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 13 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. సాంట్నర్, సోధిలకు రెండేసి వికెట్లు దక్కాయి. సెంచరీ హీరో గ్లెన్ ఫిలిప్స్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

T20 World Cup 2022: NZ Won by 65 runs against SL

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News