Thursday, June 13, 2024

పెట్టుబడుల వెల్లువ

- Advertisement -
- Advertisement -

 investments

 

రాష్ట్రంలో ఐటి, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర పరిశ్రమలు పెట్టడానికి ఉత్సాహం చూపుతున్న పెట్టుబడిదారులు

అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయ్
దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం తయారీ ప్లాంట్ నిర్మాణం చేస్తున్న హట్ సన్ అగ్రో
సంగారెడ్డిలో రూ. 207 కోట్లు
పెట్టుబడి పెడుతున్న కంపెనీ
4000 డైయిరీ రైతు కుటుంబాలకు
500 ఉద్యోగాల కల్పనకు అవకాశం
నూతనంగా వచ్చే కంపెనీలకు పూర్తి సహకారం,రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఐటి పరిశ్రమ విస్తరించేలా చర్యలు
త్వరలో రెండవ దశ టి…హబ్ ప్రారంభం
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో అధికారులతో సమీక్షలో మంత్రి కెటిఆర్

హైదరాబాద్ : రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున వస్తున్న పరిశ్రమలకు మరింత ఊతం మిచ్చేలా పనిచేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన సమావేశంలో పరిశ్రమలు, ఐటి శాఖ కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాల వలన అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయన్నారు. ఇలాంటి కంపెనీల కోసం అవసరమైన మౌళిక వసతుల రూపకల్పన, ప్రణాళికలతో సిద్దంగా ఉండాలని పరిశ్రమల శాఖాధికారులను అదేశించారు.

వివిధ రంగాల్లో టిఎస్ ఐఐసి, ప్రభుత్వం సిద్దం చేస్తున్న పలు పారిశ్రామిక పార్కులు, ఇతర మౌళిక వసతుల కల్పన కార్యక్రమాలపైన అధికారుల నుంచి మంత్రి కెటిఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పుడ్ పార్కుల బుగ్గపాడు, బండమైలారం, బండ తిమ్మాపూర్ వంటి పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న కంపెనీల వివరాలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. త్వరలోనే పుడ్ ప్రాసెసింగ్ రంగంలో పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అంశంపై అధికారిక ప్రకటన చేసేందుకు సిద్దంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.

పుడ్ ప్రాసెసింగ్ రంగంలో హట్సన్ అగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ సంగారెడ్డిలో రూ. 207 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు అధికారులకు మంత్రి తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని గోవింద్ పూర్ లో దేశంలోనే ఈ కంపెనీ అతిపెద్ద ఐస్‌క్రీం తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నదన్నారు. ఈ మేరకు అక్కడ ప్లాంట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. దీని ద్వారా సుమారు స్ధానికంగా ఉన్న 4000 డైయిరీ రైతు కుటుంబాలు ప్రయోజనం కలుగుతుందన్నారు. అలాగే స్థానికంగా ఉన్న 500 మందికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి రోజు 100 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామార్ధ్యంతో సిద్దమవుతోందన్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్తవుతుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. పనులు పూర్తికాగానే ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు.

అనంతరం మంత్రి కెటిఆర్ టెక్స్‌టైల్ రంగంలో జరుగుతున్న కార్యకలాపాలను సమీక్షించారు. వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్కు పట్ల మరిన్ని కంపెనీలు అసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. అక్కడ అవసరమైన మౌళిక వసతుల నిర్మాణం వెంటనే పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ఆ తరువాత ఐటి శాఖ కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. టి..హబ్ రెండవ దశ బిల్డింగ్ త్వరలోనే పూర్తి అవుతుందన్నారు. ఈ బిల్డింగ్ ప్రారంభం తరువాత రాష్ట్రంలోనే అతిపెద్ద ఐటి ఇంక్యూబేటర్ అవుతుందని తెలిపారు. దీంతో పాటు వచ్చే జూలైలో అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ ఏర్పాటు అవుతుందన్నారు.

అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఐటి పరిశ్రమను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని మంత్రి కెటిఆర్ వివరించారు. ఆ దిశగా ఐటి పరిశ్రమకు అవసరమైన పార్కుల అభివృద్ది, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాట్లపైన దృష్టి సారించాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటి పరిశ్రమను విస్తరించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే వరంగల్ నగరానికి పలు ప్రముఖ కంపెనీలు తమ కార్యాకలాపాలు విస్తరించేందుకు ముందుకు వచ్చాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ తరహాలోనే ఇంకా అనేక కంపెనీలు సుముఖంగా ఉన్నాయన్నారు. కరీంనగర్ పట్టణంలో ప్రభుత్వం నిర్మించిన ఐటి టవర్‌ను ఈ నెల 18వతేదిన ప్రారంభిచనున్నట్లు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

అక్కడా పలు కంపెనీలు తమ కార్యకలాపాలను త్వరలో నిర్వహించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం పట్టణాల్లోనూ ఐటి భవనాల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నదని అధికారులు మంత్రి తెలిపారు. ఈ భవనాల్లోనూ కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందకు వచ్చిన కంపెనీలతో మాట్లాడి, భవన నిర్మాణాలు పూర్తి కాగానే కంపెనీలు ఏర్పాటు అయ్యేలా చూడాలని ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్‌కు సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమ శాఖ కమీషనర్ మానిక్ రాజ్, టెక్స్ టైల్స్ డైరెక్టర్ శైలజా రామాయ్యర్, టిఎస్ ఐఐసి ఎడి వెంకట నర్సింహ్మారెడ్డితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.

Telangana as an investments state
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News