Tuesday, April 30, 2024

మాఫీ వడ్డీ రూ.2029 కోట్లు?

- Advertisement -
- Advertisement -

Farmers

 ప్రాథమిక సమాచారం ప్రభుత్వానికి సమర్పించిన బ్యాంకులు
మొత్తంగా 30,721 కోట్లు… 40.49 లక్షల మంది రైతులు
వడ్డీతో మాఫీ చేస్తామన్న సిఎం కెసిఆర్
గతేడాది డిసెంబర్ 11 వరకు రూ.లక్షలోపు పంట రుణాలపై స్లాబ్‌ల వారీగా విశ్లేషణ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్ష వరకు పంట రుణాల మాఫీలో రూ.2 వేల కోట్ల పైచిలుకు వాటి వడ్డీలకే అవుతున్నట్లు తేలింది. ఈ మేరకు బ్యాంకులు ప్రాథమిక లెక్కలను (టెనిటివ్ డేటా) వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖలకు తాజాగా నివేదించాయి. టిఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో రూ. లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. అందుకు అనుగుణంగా గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత అసెంబ్లీ సమావేశాల్లో డిసెంబర్ 11,2018ని కటాఫ్ తేదీగా సిఎం కెసిఆర్ ప్రకటించారు.

అప్పటి వరకు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. అలాగే బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయింపులు చేశారు. ఆలస్యంగా మాఫీ చేస్తుండటం, విడతల వారీగా చేస్తుండటం, గతంలోనే రైతులపై వడ్డీభారం పడటంతో సిఎం కె.చంద్రశేఖర్‌రావు రైతులు రుణాలు రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో ఒక ప్రస్తుతం ఉన్న వడ్డీని కూడా ప్రభుత్వమే మాఫీ చేస్తుందని స్పష్టం చేశారు. అయితే ఎప్పటి నుంచి తీసుకున్న రుణాలను పరిగణనలోకి తీసుకోవాలి.. నిబంధనలు ఏంటి అనే విషయాలపై స్పష్టత కొరవడింది. ఎలా అయితేనేం ముందు రూ. లక్ష లోపు డిసెంబర్ 11 వరకు ఉన్న పంట రుణాల లెక్కలు తీయాలని రాష్ట్రస్థాయ బ్యాంకర్ల కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

దీంతో అన్ని బ్యాంకులు బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలకు తీసుకున్న మొత్తాన్ని లెక్కతీశారు. తాజాగా రుణమాఫీకి సంబంధించిన ప్రాథమిక లెక్కలను ఎస్‌ఎల్‌బిసి ప్రభుత్వానికి సమర్పించింది. దీని ప్రకారం రూ. లక్ష వరకు ఉన్న పంట రుణాల మొత్తం రూ.28,694 కోట్లు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. వీటికి అదనంగా అవుతున్న వడ్డీ మొత్తం రూ. 2029 కోట్లుగా ఉంది. మొత్తంగా రూ.30,723 కోట్లు రుణమాఫీకి చెల్లించాల్సి ఉంటుందని ప్రాథమికంగా నివేదించారు. దాదాపు 40.49 లక్షల మంది రైతులు రూ. లక్షలోపు పంట రుణం తీసుకున్నవారు ఉన్నారని బ్యాంకులు ప్రభుత్వానికి తెలిపాయి. ఎస్‌ఎల్‌బిసి ఇచ్చిన నివేదిక ప్రకారం రూ. లక్ష వరకు పంట రుణం తీసుకుని, ఆ తరువాత పెరిగిన వడ్డీ సొమ్ముతో ఉన్న మొత్తమే అధికంగా ఉంది. రుణం, వడ్డీ కలిపి రూ. లక్ష పైన ఉన్న మొత్తం రూ.14,765 కోట్లుగా ఉంది. అయితే ప్రభుత్వం మార్గదర్శకాలు, నిబంధనల విడుదల చేసిన తరువాతే పూర్తి స్పష్టత రానుంది.

రైతుకు ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం

రైతులు రుణాలు రెన్యువల్ చేసుకుంటే నేరుగా వారికే ప్రభుత్వం నుంచి సొమ్ము ఇస్తామని సిఎం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అయితే అది చెక్కుల రూపంలోనా? మరొక రకంగా ఇస్తారా అనేది స్పష్టత లేదు. బ్యాంకులు మాత్రం రైతు ఖాతాకు జమ చేయాలని సూచిస్తున్నాయి. అయితే 2014లో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత రుణమాఫీ చేసినపుడు కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని రుణమాఫీ చేశారు. 18 ఏండ్ల లోపు పిల్లలు ఉంటే తల్లిదండ్రులతో కలిపి ఒక కుటుంబంగా పరిగణించారు. అంతకుమించి వయస్సు ఉంటే మరొక కుటుంబంగా గుర్తించారు.

2014 రుణమాఫీలో భాగం గా 35.29 లక్షల మంది రైతులకు రూ. 16,138 కోట్ల రుణాలను బ్యాంకు ఖాతాలకు పంపి మాఫీ చేశారు. మొదటి విడత 201415లో రూ.4,040 కోట్లు, రెండో విడత 201516లోనూ రూ.4,040 కోట్లు, 2016 17లో మూడో విడత రూ.4,025 కోట్లు, నాలు గో విడత 201718లో రూ. 4,033 కోట్లు మాఫీ చేసింది. ఇప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటారనేది స్ప ష్టత లేదు. కుటుంబం యూనిట్‌గా పరిగణిస్తే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుంది. గతంలో సోషల్ ఆడిట్ చేశారు. ఇప్పుడు దానికి బదులు సెల్ఫ్ డిక్లరేషన్ అనే ప్రక్రియను అమలు చేయాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. బాకీని ధ్రువీకరిస్తూ లిఖితపూర్వకంగా డిక్లరేషన్ తీసుకోవాలని , అక్రమాలేమైనా జరిగితే రైతులనే బాధ్యులను చేయొచ్చనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది.

స్లాబ్‌ల వారీగా వడ్డీతో కలిపి పంట రుణాలు.. 

స్లాబ్ (వడ్డీతో కలిపిన మొత్తం)                 అసలు రుణం                      వడ్డీ                   మొత్తం
(కోట్లలో) (కోట్లలో)
రూ.25 వేల వరకు                              1107                             90.51              1197
రూ.25 వేల నుంచి రూ.50 వేలు               2886                            218.35             3104
రూ.50 వేల నుంచి రూ.75 వేలు               4744                           317.74              5061
రూ.75 వేల నుంచి రూ.1 లక్ష                  5420                           355.54              5776
వడ్డీతో కలిపి రూ.1 ఒక లక్ష పైన              13,718                            1047.24           14765
మొత్తం                         28,694                           2029.38            30,723

Telangana Government Debt Waiver Rs 2029 Crores

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News