Thursday, April 18, 2024

ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో స్టే ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో స్టే ఎత్తివేత
ఈ కేసును సిబిఐకి అప్పగించాలన్న బిజెపి
పిటిషన్‌ను పెడ్డింగ్‌లో పెట్టిన హైకోర్టు
ఈ నెల 18కి విచారణ వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేయవచ్చని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో బిజెపి నేత ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు జరుగుతున్న సమయంలో మొయినాబాద్‌లో నమోదైన కేసుకు సంబంధించి దర్యాప్తుపై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధించింది. సిబిఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో ఈ కేసు విచారణ జరిపించాలని ప్రేమేందర్‌రెడ్డి పిటిషన్‌లో కోరారు. మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా కేసు దర్యాప్తు నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేయడం మంచిది కాదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు తాజా తీర్పుతో ఎంఎల్‌ఎల ఎర కేసులో దర్యాప్తు వేగవంతం చేసేందుకు మొయినాబాద్ పోలీసులకు మార్గం సుగమమైంది. సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ కేసు విచారణ జరిపించాలని బిజెపి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టింది. ఈ పిటిషన్‌పై లోతైన విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. విచారణ పురోగతిపై కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశముంది.
ఎంఎల్‌ఎ కొనుగోలు కేసులో రామచంద్ర భారత అలియాస్ సతీశ్ శర్మ, సింహయాజీ, నంద కుమార్‌లను రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఎంఎల్‌ఎల ప్రలోభపెడుతున్నారనే ఆరోపణలతో మోయినాబాద్ ఫాంహౌస్‌లో 26వ తేదీ రాత్రి రామచంద్ర భారత అలియాస్ సతీశ్ శర్మ, సింహయాజీ, నంద కుమార్‌లను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాండూరు ఎంఎల్‌ఎ రోహిత్ రెడ్డి, అచ్చంపేట ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు, కొల్లాపుర్ ఎంఎల్‌ఎ బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎంఎల్‌ఎ రేగ కాంతారావులను పార్టీ ఫిరాయించేలా ప్రలోభపెట్టారని పోలీసులు తెలిపారు. ఈ నలుగురు ఎంఎల్‌ఎలు పార్టీ మారితే వారికి డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ ప్రలోభపెట్టారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రభావితం చేసేలా ఓ జాతీయ పార్టీ అండదండలతో వ్యూహాత్మక బేరసారాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటన రాజకీయంగా సృష్టించింది.

Telangana HC Lifts Stay on TRS MLAs Poaching Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News