Wednesday, October 9, 2024

రైతు కూలీ జనం చేసిన వీరోచిత పోరాటం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. పోరాడితే పోయేదేమీ లేదన్న తెగింపుతో భూమి, భుక్తి, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం రైతుకూలీ జనం తిరగబడిన అపూర్వ ఘట్టం. చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించిన అద్భుత సందర్భం. ఉక్కు సంకల్పంతో ప్రాణాలను తృణప్రాయంగా భావించి పోరాడిన వీరులు, వీరవనితలూ ఎందరో. రాజ్య వ్యవస్థపట్ల సమాజంలో అసంతృప్తి రగిలినప్పుడు జరిగేవే సామాజిక ఉద్యమాలు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో హైదరాబాద్ సంస్థానంలో ఆహార ధాన్యాల కొరత విపరీతంగా ఏర్పడింది. ధాన్య సేకరణ కోసం ప్రభుత్వం అనేక ఫర్మానాలను జారీ చేసింది.

ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు రైతులు లెవీ ధాన్యాన్ని కొనాల్సి రావడం, ధాన్య సేకరణతో తెలంగాణలోని చిన్న, మధ్య తరగతి రైతాంగం, రైతు కూలీల్లో అసంతృప్తి ప్రబలింది. తెలంగాణలో నాగు అనే వడ్డీ వ్యాపారం రైతులను కూలీలుగా మార్చింది. ఇన్ని ప్రజా వ్యతిరేక విధానాలను సహించలేని ప్రజలు నిజాం నిరంకుశ పాలనను, భూస్వామ్య వ్యవస్థను అంతం చేయడం, పన్నుల నిరాకరణ, మద్యపాన నిషేధం, వడ్డీ వ్యాపారాన్ని నిర్మూలించాలంటూ సాగించిన ఈ రైతాంగ సాయుధ పోరాటం భారత దేశ రైతాంగ పోరాటాల్లో ఒక మహత్తర విముక్తి పోరాటం.

చైనాలో తప్ప ఆసియాలో ఇంత పెద్ద రైతాంగ పోరాటం ఎక్కడా జరగలేదు. ఈ పోరాటం వల్ల తెలంగాణలో పాలన, రాజ్యాగ సంస్కరణలు, పాఠశాలలు, పౌర హక్కులు, ఉద్యోగ నియామకాలు మొదలైన అంశాల్లో ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఆంధ్రమహాసభ ప్రారంభించిన ఉద్యమం ప్రాంతీయ ఆర్థిక రాజకీయ ఆకాంక్షలు, మధ్య తరగతి, శిష్టవర్గాల అభిమతాలను రాజకీయ అలజడులను ప్రతిబింబించింది. 1936 నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ ప్రాంతంలో తన కార్యక్రమాలను ప్రారంభించి కాలక్రమంలో తెలంగాణ రైతు ఉద్యమానికి నాయకత్వం వహించింది. 1944- 46 మధ్యకాలంలో తెలంగాణ అంతటా కమూనిస్టు పార్టీ కార్యక్రమాలు విస్తరించి ఆంధ్రమహాసభ తీర్మానాలను చేజిక్కించుకొని పెద్ద ఎత్తున రైతు ఉద్యమం ప్రారంభం కావడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పర్చారు.

1946లో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితులు, రాజకీయ సామాజిక పరిస్థితులు రైతాంగ పోరాటం ప్రారంభం కావడానికి దోహదపడ్డాయి. 1946 జూలై 4న లాఠీలు, కొడవళ్లు పట్టుకొని వేలాది మంది రైతులు పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లి దేశముఖ్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే దేశ్‌ముఖ్‌లు ఏర్పాటు చేసుకున్న కిరాయి గూండాలు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమరయ్య నేలకొరిగాడు. కొమరయ్య వీర మరణంతో ఉద్యమం ఉధృతమై సాయుధ పోరాటానికి నాంది పలికింది. నిజాం ప్రభుత్వానికి దేశ్‌ముఖ్‌లు, బడా భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటంలో వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మొదట్లో తిరుగుబాటు ఆకస్మికంగా ప్రారంభమైంది. కమ్యూనిస్టులు, ఆంధ్రమహాసభ, దళితులు రైతాంగ ఉద్యమానికి నైతిక మద్దతును అందించారు.

1948లో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ రెండో సమావేశంలో తెలంగాణ రైతాంగ పోరాటాన్ని ఒక విప్లవ పోరాటంగా కొనసాగించాలని తీర్మానించారు. రైతులందరినీ సైన్యంగా ఏర్పర్చి గెరిల్లా పోరాటం చేశారు. నిజాం ప్రభుత్వం ఎదుర్కొంటున్న కల్లోల పరిస్థితులను, ప్రజల భయాందోళనలను గుర్తించిన భారత ప్రభుత్వం 1948, సెప్టెంబర్ 13న భారత సైన్యాన్ని హైదారాబాద్‌కు పంపించింది. తెలంగాణ ప్రాంతంలో రజాకార్లు కాశీం రజ్వీ సృష్టించిన అరాచకం, దారుణ, మారుణకాండలకు అడ్డుకట్ట వేయడానికి, శాంతి
భద్రతలను కాపాడటానికిగాను పోలీస్ చర్యను జరిపి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసారు. ఈ చర్య అనంతరం కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సాయుధ రైతాంగ పోరాటాల్ని కొనసాగించాలని నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది.

నిజానికి పోలీస్ చర్య సర్వసమ్మతం కాకపోయినా అత్యావశ్యక చర్య అయింది. రజాకార్లను అణిచివేసి నిజాం పాలనను అంతం చేసి సైనిక ప్రభుత్వాన్ని నెలకొల్పడంతో తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న రైతు ఉద్యమాన్ని అణిచివేయడంపై కేంద్రం దృష్టి కేంద్రీకరించినది. ఈ చర్యలో భాగంగా భారత సైన్యం కమ్యూనిస్టు దళాలను అణిచివేయడానికి సకల ప్రయత్నాలు చేసింది. వీటన్నింటి ప్రభావంతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ఉపసహంరించుకోవాల్సి వచ్చింది.

అంతిమంగా ఐదేండ్ల పాటు కొనసాగిన ఈ వీరోచిత రైతాంగ పోరాటంలో వివిధ స్థాయిలకు చెందిన రైతులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ ఉద్యమం మొట్టమొదటిసారిగా కౌలుదారు, భూమిలేని రైతు కూలీలను ఏకం చేసింది. పేద రైతులు బలం పుంజుకోగలిగారు. ముఖ్యంగా వెట్టిచాకిరికి గురవుతున్న గిరిజన రైతులు వెట్టి నుంచి విముక్తి పొందారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రభావంతో సుమారు పది లక్షల ఎకరాల భూమిని భూమిలేని నిరుపేదలకు పంచారు. తెలంగాణ రైతు ఉద్యమం కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసింది. భూస్వామ్య వ్యవస్థ బలహీనపడి రైతాంగంలో ఐక్యత బలపడింది. రజాకార్లకు వ్యతిరేకంగా పుచ్చపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు నాయకత్వంలో రైతాంగ పోరాటం తీవ్ర రూపం దాల్చింది. 1947 సెప్టెంబర్ 11న నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పోరాట కాలంలో గ్రామరక్షక దళాలు రక్షణ వ్యవస్థగా ఏర్పడ్డాయి. సర్దార్ వల్లభ బాయ్ పటేల్ హైదరాబాద్‌లో జరుగుతున్న రైతాంగ పోరాటాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారు. సుమారు 4000 గ్రామాలను కమ్యూనిస్టులు తమ ఆధీనంలోకి తెచ్చుకొని భూస్వాముల భూములను భూమిలేని పేదలకు రైతుకూలీలకు పంచారు.

నాదెండ్ల శ్రీనివాస్
9676407140

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News