Thursday, October 10, 2024

కాంగ్రెస్ కోటా వ్యతిరేకత మళ్లీ బహిర్గతం

- Advertisement -
- Advertisement -

రిజర్వేషన్లపై రాహుల్ వ్యాఖ్యకు అమిత్ షా ఆక్షేపణ
‘జాతి వ్యతిరేక వ్యాఖ్యలు’ చేయడం ప్రతిపక్ష నేతకు, ఆ పార్టీకి పరిపాటి
బిజెపి ఉన్నంత కాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోటా వ్యాఖ్య కాంగ్రెస్ ‘రిజర్వేషన్ వ్యతిరేక వైఖరి’ని మరొక మారు బహిర్గతం చేసిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బుధవారం అన్నారు. ‘జాతి వ్యతిరేక వ్యాఖ్యలు’ చేయడం ప్రతిపక్ష నేతకు, ఆయన పార్టీకి పరిపాటిగా మారిందని హోమ్ శాఖ మంత్రి ఆరోపించారు. రాహుల్ గాంధీకి అమిత్ షా ఒక కఠిన సందేశం పంపుతూ, బిజెపి ఉన్నంత కాలం రిజర్వేషన్ల రద్దుకు గాని, దేశ భద్రతతో చెలగాటానికి గాని ఎవరూ పూనుకోజాలరని హెచ్చరించారు. ‘భారత్‌లో సమ న్యాయం జరిగినప్పుడు’ రిజర్వేషన్ల రద్దు గురించి కాంగ్రెస్ ఆలోచిస్తుందని, ప్రస్తుతం దేశంలో అటువంటి పరిస్థితి లేదని రాహుల్ గాంధీ యుఎస్‌లోని జార్జిటౌన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో చెప్పిన తరువాత బిజెపి సీనియర్ నేత అమిత్ షా ఆ వ్యాఖ్యలు చేశారు.

‘దేశాన్ని చీల్చేందుకు కుట్ర పన్నుతున్న శక్తుల పక్కన నిలబడడం, జాతి వ్యతిరేక ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది’ అని అమిత్ షా ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ ‘జాతి వ్యతిరేక, రిజర్వేషన్ వ్యతిరేక అజెండా’ను సమర్థించడం లేక విదేశీ వేదికలపై ‘భారత్ వ్యతిరేక ప్రకటనలు’ చేయడం ద్వారా రాహుల్ గాంధీ దేశ భద్రతను ‘ఎల్లప్పుడూ ముప్పు తెస్తుంటారు’ అని, సెంటిమెంట్లను గాయపరుస్తుంటారని కూడా మంత్రి విమర్శించారు.

‘ప్రాంతీయవాదం, మతం, భాషపరమైన అంతరాల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ గాంధీ ప్రకటన బట్టబయలు చేసింది. దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి మాట్లాడడం ద్వారా రాహుల్ గాంధీ మరొక మారు కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని ముందుకు తెచ్చారు’ అని అమిత్ షా తన పోస్ట్‌లో విమర్శించారు. లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుని మనస్సులో ఉన్న భావాలు ఇప్పుడు మాటల రూపంలో వెలువడ్డాయని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అన్నారు. ‘బిజెపి ఉన్నంత కాలం ఎవరూ రిజర్వేషన్లను రద్దు చేయజాలరని, దేశ భద్రతతో ఎవరూ చెలగాటం ఆడజాలరని రాహుల్ గాంధీకి స్పష్టం చేయడలిచాను’ అని అమిత్ షా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News