Monday, April 29, 2024

చంద్రునిపై ఉష్ణోగ్రతల సమాచారం వెల్లడి

- Advertisement -
- Advertisement -

చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ లోని ఛేస్ట్ పేలోడ్ పంపిన తొలిఫలితాలు

న్యూఢిల్లీ : చంద్రయాన్ 3 ఫలితాలు ప్రపంచం ముందుకు వస్తున్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రతల తీరు మొదటిసారి తెలిపింది. చంద్రునిపైగల నేల ఉష్ణోగ్రతలు, చంద్రుని ఉపరితలంలో 10 సెంటీమీటర్ల లోతులో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయో వెల్లడైంది. ఈనెల 23న విజయవంతంగా చంద్రునిపై దిగిన విక్రమ్ ల్యాండర్ లోని ఛేస్ట్ పేలోడ్ పంపించిన ఈ తొలిఫలితాలను ఇస్రో ఆదివారం వెల్లడించింది. చంద్రుని దక్షిణ ధ్రువం వెంబడి ఉపరితలం లోని నేల ఉష్ణోగ్రతల తీరును ఛేస్ట్ (చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ ) కొలిచిందని ఇస్రో తెలిపింది. దీని ఆధారంగా చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలు మారే తీరును అర్థం చేసుకోవచ్చని పేర్కొంది. అంటే వేడి తగిలినప్పుడు ఏదైనా వస్తువు ఏ విధంగా స్పందిస్తుందో తెలుసుకోవచ్చు.

పరిసరాల నుంచి వచ్చే వేడిని ఏదైనా వస్తువు స్వీకరించినప్పుడు దాని ఉష్ణోగ్రత పెరుగుతోందా ? లేదా ? వంటి విషయాలను తెలుసుకోవచ్చు. చంద్రుని ఉపరితలంలో 10 సెంటీమీటర్ల లోతు వరకు చొచ్చుకెళ్లి ఉష్ణోగ్రతలను కొలిచేందుకు తగిన పరికరాలను ఛేస్ట్ లో అమర్చినట్టు ఇస్రో తెలిపింది. ఉపరితలం నుంచి కిందికి చొచ్చుకెళ్లే ప్రక్రియ నియంత్రణతో జరుగుతుందని తెలిపింది. దీనికి విడివిడిగా 10 టెంపరేచర్ సెన్సర్లను అమర్చినట్టు తెలిపింది. ఛేస్ట్ చంద్రుని ఉపరితలంలో వేర్వేరు లోతుల్లో ఉన్నప్పుడు ఉష్ణోగ్రతల తేడాలను చూపిస్తున్న ఓ గ్రాఫ్‌ను కూడా ఇస్రో ట్వీట్ చేసింది.

చంద్రుని దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఉష్ణోగ్రతలు మారే తీరును వివరించే మొదటి సమాచారం ఇది. ఈ గ్రాఫ్‌ను పరిశీలించినప్పుడు చంద్రునిపై ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ నుంచి దాదాపు 55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఛేస్ట్ పేలోడ్‌ను స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, వీఎస్‌ఎస్‌సీ, అహ్మదాబాద్ లోని పీఆర్‌ఎల్ సహకారంతో అభివృద్ధి చేసి , తయారు చేసినట్టు తెలిపింది. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపింది. చంద్రయాన్ 3 లో ఏడు పేలోడ్సు ఉన్నాయి. విక్రమ్ ల్యాండర్ పైన 4, ప్రజ్ఞాన్ రోవర్ పైన 2 ఉన్నాయి. మరొకటి ప్రొపల్షన్ మాడ్యూల్ పేలోడ్. వీటిని వేర్వేరు శాస్త్రీయ పరిశోధనల కోసం రూపొందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News