Monday, April 29, 2024

భారత్ విజయానికి ప్రతీక చంద్రయాన్ 3 : మోడీ

- Advertisement -
- Advertisement -

భారత్ విజయానికి ప్రతీక చంద్రయాన్ 3 :
మన్‌కీ బాత్ 104 వ ఎపిసోడ్‌లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : చంద్రయాన్ 3 భారత్ విజయానికి ఎప్పటికీ ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని మోడీ కొనియాడారు. మన్‌కీబాత్ 104 వ ఎపిసోడ్‌లో ఆదివారం ప్రధాని మోడీ మాట్లాడారు. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిందన్నారు. భారత్ వచ్చే నెల ఢిల్లీలో జీ 20 సమావేశాలకు సిద్ధమవుతోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారని వెల్లడించారు. తొలిసారి భారత్ ఈ స్థాయి జీ20 లో భాగస్వామి అవుతోందని, గ్రూపును మరింత కలుపుగోలుగా చేస్తోందని చెప్పారు.

జీ20 కి భారత్ నేతృత్వం అంటే, ప్రజలే అధ్యక్షత వహిస్తున్నట్టు భావించాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. “ భారత్ జీ20 అథ్యక్షతన బాథ్యతలను స్వీకరించిన నాటి నుంచి గర్వించదగిన పరిణామాలు చాలా చోటు చేసుకొన్నాయి. ఇప్పటివరకు ఈ సదస్సులు జరిగిన నగరాల్లో ప్రజలు విదేశీ అతిథులను సాదరంగా ఆహ్వానించారు. భారత్ లోని వైవిధ్యాన్ని , ప్రజాస్వామ్యాన్ని చూసి విదేశీ అతిథులు చాలా ప్రభావితమయ్యారు. భారత్‌కు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉందని వారు తెలుసుకొన్నారు. జీ20 సదస్సు శ్రీనగర్‌లో జరిగిన తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నేడు భారత్ క్రీడల్లో నిలకడగా విజయాలు సాధిస్తోంది. తాజాగా చైనాలో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో రికార్డు స్థాయిలో మనవాళ్లు పతకాలు సాధించారు.

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం నాడు దాదాపు 10 కోట్ల మంది జాతీయ పతాకంతో సెల్ఫీ దిగారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు.. ‘సంస్కృత భారతీ’ ఆధ్వర్యంలో సంస్కృతంలో మాట్లాడే క్యాంప్ ’ నిర్వహిస్తారు. ప్రజలకు ఈ భాషను బోధించడంలో భాగంగా జరిగే క్యాంపులో మీరూ పాల్గొనవచ్చు. అంతేకాదు… తెలుగు కూడా సంస్కృతంలా పురాతనమైన భారతీయ భాష. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా “ మేరీ మాటి.. మేరీ దేశ్ కార్యక్రమం జోరుగా జరుగుతోంది. సెప్టెంబర్ నెలలో దేశ వ్యాప్తంగా ప్రతి ఇల్లు, ప్రతి గ్రామం నుంచి మట్టి నమూనా సేకరించే కార్యక్రమం ఉద్యమ స్థాయిలో జరుగుతుంది” అని ప్రధాని మోడీ మన్‌కీ బాత్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో పాల్గొన్న అమాకలపఖ. ప్రగతి, ప్రియాంక తదితరులతో ముచ్చటించారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News