Tuesday, April 30, 2024

సిరీస్‌పై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -

 India vs New zealand 3rd T20

 

కివీస్‌కు సంకటం, జోరుమీదున్న కోహ్లి సేన, నేడు మూడో టి20

హామిల్టన్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగే మూడో ట్వంటీ20లో కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఇందులో కూడా గెలిచి కివీస్ గడ్డపై తొలిసారి టి20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆతిథ్య న్యూజిలాండ్ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. అయితే జోరుమీదున్న విరాట్ కోహ్లి సేనను ఓడించడం కివీస్‌కు అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న భారత్‌పై విజయం సాధించాలంటే ఆతిథ్య జట్టు అసాధారణ ఆటను కనబరచక తప్పదు. అప్పుడే కివీస్‌కు గెలుపు అవకాశాలుంటాయి. లేకుంటే హ్యాట్రిక్ ఓటములతో సిరీస్‌ను కోల్పోవడం ఖాయం.

రోహిత్ ఈసారైనా..
తొలి రెండు మ్యాచుల్లో విఫలమైన స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. వరుసగా రెండు మ్యాచుల్లో కూడా రోహిత్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా మెరుగైన ఇన్నింగ్స్ ఆడాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. కివీస్ గడ్డపై అత్యంత పేలవమైన రికార్డు కలిగిన రోహిత్ ఈసారి కూడా నిరాశే మిగిల్చాడు. కొంతకాలంగా ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్న రోహిత్ కివీస్‌తో జరిగిన రెండు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. సహచరుడు లోకేశ్ రాహుల్ రెండు మ్యాచుల్లోనూ భారీ స్కోర్లతో అలరించాడు. అయితే రోహిత్ మాత్రం రెండు మ్యాచుల్లో కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. అయితే ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్‌ను తక్కువ అంచనా వేయలేం. ఒకసారి గాడిలో పడితే ఆపడం ఎంత బౌలర్‌కైనా చాలా కష్టం. రోహిత్ కూడా ఈసారి ఎలాగైన భారీ స్కోరును సాధించాలనే పట్టుదలతో మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు.

జోరుమీదున్నారు
మరోవైపు ఓపెనర్ లోకేశ్ రాహుల్, యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ జోరుమీదున్నారు. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. కొంతకాలంగా అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న రాహుల్ ఈ సిరీస్‌లోనూ అదే జోరును కనబరుస్తున్నాడు. తొలి రెండు టి20ల్లో కూడా అర్ధ సెంచరీలతో అలరించాడు. ఈ మ్యాచ్‌లోనూ జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు అయ్యర్ కూడా దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. రెండు మ్యాచుల్లో కూడా మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్‌లో కూడా సత్తా చాటాలనే లక్షంతో ఉన్నాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో కూడా జట్టును ముందుండి నడిపించేందుకు సిద్ధమయ్యాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడం కోహ్లి లక్షంగా పెట్టుకున్నాడు. దీంతో విజృంభిస్తే న్యూజిలాండ్ బౌలర్ల కష్టాలు రెట్టింపు కావడం ఖాయం. శివమ్ దూబే, మనీష్ పాండే, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ షమి తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇక, వికెట్ కీపర్లు రిషబ్‌పంత్, సంజూ శాంసన్‌లకు ఈ మ్యాచ్‌లో కూడా తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. రాహుల్ వికెట్ కీపర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో అతన్నే కీపర్‌గా కొనసాగించడం ఖాయమని చెప్పాలి.

బౌలర్లే కీలకం
కిందటి మ్యాచ్‌లో భారత బౌలర్లు అసాధారణ బౌలింగ్‌ను కనబరిచారు. కీలక సమయంలో వికెట్లు తీయడమే కాకుండా పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈసారి కూడా బౌలర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. షమి, బుమ్రా, జడేజా, ఠాకూర్, సైని, చాహల్, కుల్దీప్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు భారత్‌కు అందుబాటులో ఉన్నారు. కిందటి మ్యాచ్‌లో బుమ్రా, జడేజాలు పొదుపుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు.

చావో రేవో
ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన ఆతిథ్య న్యూజిలాండ్‌కు బుధవారం జరిగే మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఇందులో ఓడితే సిరీస్ కోల్పోక తప్పదు. దీంతో న్యూజిలాండ్ జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. తొలి టి20లో 200కి పైగా పరుగులు సాధించినా పరాజయం తప్పలేదు. కిందటి మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరుస విజయాలతో దూకుడు మీద కనిపిస్తున్న భారత్‌కు ఓడించాలంటే కివీస్ సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. ఇందులో ఎంత వరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే.

మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం

Today India vs New zealand 3rd T20
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News