Friday, April 26, 2024

శంషాబాద్ సమీపంలో అతిపెద్ద ధ్యాన మందిరం

- Advertisement -
- Advertisement -

Meditation center

 

2, 7 తేదీల్లో రాష్ట్రపతి కోవింద్, అన్నాహజారే ప్రసంగాలు

హైదరాబాద్ ః ఆహ్లాదకర వాతావరణం, సువిశాల స్థలం, పర్యావరణ నీడలో ప్రశాంతంగా ధ్యానమాచరించేందుకు శంషాబాద్ సమీపంలోని చేగూర్ గ్రామ పరిసరాల్లో హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్, శ్రీరామచంద్ర మిషన్ 75వ వార్షికోత్సవ సందర్భంగా ౩౦ ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ధ్యాన కేంద్రాన్ని ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా మంగళవారం ఉదయం ప్రారంభించారు.

1400 ఎకరాల విస్తీర్ణంలో వున్న కన్హా శాంతివనంలో ౩౦ ఎకరాలలో ఈ ధ్యాన కేంద్రం ఏర్పాటైంది. దీంతో ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రానికి రాష్ట్రంలో శంషాబాద్ వేదికగా నిలిచింది. అఖిల భారతీయ శ్రీ గురుదేవ్ సేవా మండల్, గురుకుంజ్ ఆశ్రమానికి చెందిన జనార్థన్ పంత్ బోధె, సురేష్ ప్రభులతో పాటు పలువురు ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా హాజరైన 40వేల మంది అభ్యాసీలు ధ్యాన కేంద్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి సమక్షంలో హార్ట్‌ఫుల్‌నెస్ ప్రప్రథమ మార్గదర్శి లాలాజీ కి హార్ట్‌ఫుల్‌నెస్ ప్రస్తుత మార్గదర్శి కమలేష్ పటేల్ ఈ కేంద్రాన్ని అంకితం చేశారు.

ఈ ధ్యాన కేంద్రంలో ఒకేసారి ఏకంగా లక్ష మంది ధ్యానం చేసుకోవచ్చు. ఒక పెద్ద ధ్యాన కేంద్రంతో పాటు దాని చుట్టూ 8 ఉప కేంద్రాలతో కూడిన ఈ కేంద్రాన్ని పై నుంచి వీక్షిస్తే తాబేలు ఆకారంలో కనిపించేలా నిర్మాణం చేపట్టారు. ఇందులో రోజుకు లక్ష మందికి భోజనాలు పెట్టే విధంగా సదుపాయాలు, 40 వేల మందికి పైగా వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 350 పడకలు ఉన్న ఆయుష్ దవాఖాన, పర్యావరణ హితమైన ఆరు లక్షల మొక్కలు కలిగిన నర్సరీలో ఈ ప్రాంగణంలో ఉన్నాయి. ఈ ధ్యాన కేంద్ర నిర్మాణాన్ని మూడు సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేశారు.

2న రాష్ట్రపతి, 7న సామాజిక కార్యకర్త అన్నాహజారే రాక…
సామూహిక ధ్యాన కార్యకలాపాలలో భాగంగా.. 2020 జనవరి 2830, ఫిబ్రవరి 24, ఫిబ్రవరి 79వ తేదీలలో జరిగే మూడేసి రోజుల సెషన్ల ద్వారా సుమారు 1.2 క్షల మంది అభ్యాసకులకు ఆతిధ్యం ఇవ్వనున్నామని హార్ట్‌పుల్‌నెస్‌ఇన్‌స్టిట్యూట్, రామచంద్రమిషన్ మీడియాకు తెలిపింది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, అన్నాహజారే వరుసగా ఫిబ్రవరి 2,7న అభ్యాసకులనుద్దేశించి ప్రసంగిస్తారు. జనవరి 29న బాబా రామ్‌దేవ్ ప్రసంగం ఉందన్నారు. వేడుకలు, ప్రారంభోత్సవాలకు హాజరయ్యే ప్రముఖుల జాబితాలో పలువురు రాష్ట్ర గవర్నర్లు పాల్గొంటారని తాము భావిస్తున్నట్లు నిర్వాహకులు మీడియాకు వెల్లడి చేశారు.

130 దేశాలలో 5వేలకు పైగా ధ్యాన కేంద్రాలు
శ్రీరామచంద్ర మిషన్ 1945లో ఉత్తరప్రదేశ్‌లో అప్పటి గురూజీ బాబూజీ మహారాజ్ ఆధ్యాత్మిక్ సంస్థను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలలో ఐదు వేలకు పైగా ధ్యాన కేంద్రాలు ఏర్పడ్డాయి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అభ్యాసీలు లక్షల మందిలో ఉన్నారు.

ధ్యాన విధానం ఉచితం
హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్, శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ ధ్యాన కేంద్రంలో ధ్యాన విధానం ఉచితంగా అందించబడుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇందుకుగానూ ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేదన్నారు. దాతల సహాయంతో ఈ సంస్థ నిర్వహింపబడుతోందన్నారు. ధ్యాన సాధన ద్వారా తమతమ జీవితాలని మెరుగుపరుచుకుందామని ఆకాంక్షించే వారందరికీ స్ఫూర్తి దాయనిగా ఉండేందుకు అత్యంత శ్రద్ధాసక్తులతో దీనిని నిర్మించామన్నారు. ఇది మానవ సమాజానికి ఈ విశ్వం అందించిన ఒక వరప్రసాదమన్నారు. ఒత్తిడిని జయించేందుకు సహజమార్గ్ పద్ధతిలో ధ్యానం చేయించేందుకు ఎందరో అభ్యాసీలు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ అభ్యాసీల సంఖ్యను రోజురోజుకు పెంచుతున్నారన్నారు. హైదరాబాద్‌లోని పలు డిపోల నుంచి ఆశ్రమానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. విమా నాశ్రయం, రైల్వేస్టేషన్ల నుంచి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు.

వసతులు భేష్.. సందర్శకుల కితాబు..
కాగా, ధ్యాన కేంద్రంలో ధ్యానమాచరించేందుకు వచ్చిన పలువురిని ఇక్కడ ఎలా వుంది? అని పలుకరించిన సందర్భంలో చాలా బాగుందని, వసతులు బాగున్నాయని తెలిపారు. మూడు రోజుల పాటు శిక్షణ తీసుకునేందుకు వచ్చామని, తమ వద్ద నిర్వాహకులు పైసా ఆశించలేదన్నారు. విదేశాల నుంచి కూడా పలువురు కన్హా ఆశ్రమానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో మానవ సమాజానికే కాక అన్ని జీవజాతులకూ సేద దీర్చే ఒక ప్రశాంతవనంగా కన్హా శాంతివనం తీర్చిదిద్దడమే లక్షంగా పెట్టుకున్నామని నిర్వాహకులు స్పష్టం చేశారు. దాతలతో ఈ కన్హాశాంతివనం నడుస్తోందని, ఈ క్రమంలో ధ్యానమాచరించేందుకు వచ్చి శిక్షణ తీసుకునేవారి వద్ద నుంచి తామేమీ ఆశించడం లేదని చెప్పారు. మరోవైపు వసతి సౌకర్యాలను బట్టి పరిమిత రుసుం ఉండగలదని ఒక ప్రశ్నకు సమాధానంగా నిర్వాహకులు వెల్లడించారు.

 

Ramdev Baba started Meditation center
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News