వాషింగ్టన్: భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి బిగ్ షాకిచ్చాడు. భారత్ పై అదనంగా మరో 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ.. భారత్ పై ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ 25 శాతం అదనంగా సుంకాలను విధించడంతో… భారత్ పై మొత్తం సుంకాలు 50 శాతానికి పెరిగాయి. భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదని, ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాలలో భారత్ ఒకటి అని.. అందుకే భారత్ తో తాము తక్కువ వాణిజ్య వ్యాపారాన్ని చేస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నాడు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందున రాబోయే 24 గంటల్లో భారత్ పై సుంకాలను భారీగా పెంచుతానని మంగళవారం ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ లో పోస్ట్ చేశాడు. అన్నట్టుగానే ఒక రోజు గడవకముందే భారత్ పై మరో 25 శాతం అదనపు సుంకాలను విధించాడు.