Friday, September 13, 2024

నిండుకుండలా సింగూర్ జలాశయం

- Advertisement -
- Advertisement -

సింగూరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నిండుకుండలా మారింది. ప్రాజెక్టు సామర్థ్యానికి నీటిమట్టం చేరుకోవడంతో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరితో కలిసి ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్టుకు వస్తున్న వరద పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగూరు జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుండడంతో ప్రాజెక్టు 4,6 నంబర్ల రెండు గేట్లను 1.50 మీటర్ల పైకెత్తి 16284 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 28.555 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో జెన్ కో ద్వారా 2822 క్యూసెక్కులు, గేట్ల ద్వారా 16284 క్యూసెక్కులు కాగా, మొత్తం 19106 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ సింగూర్ ప్రాజెక్టు నిండు కోవడం వలన ఆయకట్టు రైతంగానికి పంటల సాగుకు ఢోకా ఉండదని ఆయన అన్నారు. ప్రాజెక్టు జలకలను సంతరించుకోవడం సంతోషకరమన్నారు. ఎగువ ప్రాంతం నుండి భారీగా వరదనీరు వస్తుండడంతో దిగువకు నీరు వదిలమన్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సింగూరు నిండుకుండల మారడంతో ఈ ప్రాంతమంతా సాగునీటితో సస్యశ్యామలం కానుందన్నారు. అనంతరం ప్రాజెక్టు సమీపంలోని టూరిజం పార్కును సందర్శించారు. పార్కులోని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మంత్రి హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News