Monday, June 24, 2024

జగజ్జేత బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -

ఫైనల్లో యువ భారత్ ఓటమి, అండర్19 ప్రపంచకప్
పోచెఫ్‌స్ట్రూమ్: అండర్19 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ యువ జట్టు ట్రోఫీని సాధించింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో మూడు వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌పై సంచలన విజయం సాధించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన బంగ్లాదేశ్ అసాధారణ ఆటతో ఏకంగా ట్రోఫీని గెలుచుకుని పెను ప్రకంపనలే సృష్టించింది. మరోవైపు ఫైనల్‌కు చేరుకునే క్రమంలో ఏకపక్ష విజయాలు సాధించిన భారత్ ఆఖరి పోరాటంలో మాత్రం నిరాశ పరిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. తర్వాత లక్షఛేదనకు దిగిన బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 42.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి జయకేతనం ఎగుర వేసింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపు కోసం తీవ్రంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. బంగ్లాదేశ్ కెప్టెన్ అక్బర్ అలీ చిరస్మరణీయ బ్యాటింగ్‌తో జట్టుకు ట్రోఫీని సాధించి పెట్టాడు.
శుభారంభం
కష్ట సాధ్యం కానీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు పర్వేజ్ హుస్సేన్, తంజీద్ హసన్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టును లక్షం దిశగా నడిపించారు. పర్వేజ్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సమయంలో పర్వేజ్ రిటైర్‌హర్ట్ అయ్యాడు. మరో ఓపెనర్ తంజీద్ హసన్ రెండు ఫోర్లు, సిక్స్‌తో 17 పరుగులు చేసి ఔటయ్యాడు.
బిష్ణోయ్ మాయ
సాఫీగా సాగుతున్న బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను స్టార్ బౌలర్ రవి బిష్ణోయ్ కోలుకోలేని దెబ్బతీశాడు. తొలుత తంజీద్‌ను ఇంటికి పంపాడు. దీంతో 50 పరుగుల వద్ద బంగ్లా మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఆ వెంటనే మహ్మదుల్ హసన్ జాయ్‌ను కూడా బిష్ణోయ్ ఔట్ చేశాడు. సెమీస్ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన మహ్మదుల్ ఈసారి 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు తౌహిద్ (౦) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఈ వికెట్ కూడా రవి ఖాతాలోకే వెళ్లింది. ఆ వెంటనే షాదాత్ హుస్సేన్ కూడా ఔటయ్యాడు. ఒక పరుగు మాత్రమే చేసి రవి బౌలింగ్‌లోనే స్టంపౌట్ అయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 15 పరుగుల తేడాతో నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకుంది.
అక్బర్, పర్వేజ్ పోరాటం
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను కెప్టెన్ అక్బర్ అలీ తనపై వేసుకున్నాడు. షమీమ్ (8)తో కలిసి అక్బర్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే కీలక సమయంలో షమీమ్ ఔట్ కావడంతో బంగ్లా కష్టాలు మరింత పెరిగాయి. కానీ, కెప్టెన్ అక్బర్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా జట్టును లక్షం దిశగా నడిపించాడు. ఇదే సమయంలో అవిషేక్ దాస్ (5) కూడా ఔటయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 102 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో భారత్ గెలుపు ఖాయంగా కనిపించింది. కానీ, రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగిన ఓపెనర్ పర్వేజ్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. వచ్చి రావడంతోనే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వరుస ఫోర్లతో స్కోరును పరిగెత్తించాడు. కెప్టెన్ అక్బర్ కూడా కీలక ఇన్నింగ్స్‌తో తనవంతు పాత్ర పోషించాడు. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన పర్వేజ్ ఏడు ఫోర్లతో 47 పరుగులు చేసి వెనుదిరిగాడు. పర్వేజ్ ఔటైనా అక్బర్ తన పోరాటాన్ని కొనసాగించాడు. అతనికి రకిబుల్ హసన్ అండగా నిలిచాడు. ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్ ఆగి పోయింది. అప్పటికీ బంగ్లాదేశ్ 41 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కాగా, వర్షం తగ్గిన తర్వాత బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 170 పరుగులుగా నిర్ధారించారు. దీన్ని బంగ్లాదేశ్ అలవోకగా ఛేదించింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన అక్బర్ ఒక సిక్స్, 4 ఫోర్లతో 43 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రకిబుల్ హసన్ 9 (నాటౌట్) అతనికి అండగా ఉన్నాడు.
జైస్వాల్ మెరుపులు


అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆదుకున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న జైస్వాల్ ఒక సిక్సర్, మరో 8 ఫోర్లతో 88 పరుగులు సాధించాడు. అతనికి తిలక్ వర్మ అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి రెండో 94 పరుగులు జోడించారు. తిలక్‌వర్మ 38 పరుగులు చేశాడు. మిగతావారిలో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (22) మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలం కావడంతో భారత్ ఇన్నింగ్స్ 177 పరుగుల వద్దే ముగిసింది.

U19 World Cup: Bangladesh won by 3 wickets against India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News