Monday, April 29, 2024

ఉద్ధవ్‌కు ‘కేబినెట్’ లుకలుకలు

- Advertisement -
- Advertisement -

Uddhav-Thackeray

 చోటుదక్కని ఆశావహుల్లో నిరాశ
షోలాపూర్ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో అసంతృప్తి
విధేయుల్ని విస్మరించి కొత్త వారికి పదవులిచ్చారని ధ్వజం

ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ సోమవారం జరిగిన తరువాత శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ పార్టీల్లో పార్టీ విధేయుల్ని విస్మరించి కొత్త వారికి పదవులు కట్టబెట్టారన్న అసమ్మతి రాజుకుంది. కొందరు పార్టీలకు రాజీనామా చేయడానికి కూడా మంగళవారం సిద్ధం కాగా, సీనియర్లు వారిని బుజ్జగించడం ప్రారంభించారు. అయినా కొందరు అసంతృప్తితో రాజీనామా పత్రాలు పార్టీ అధిష్ఠాన వర్గాలకు పంపారు. మాజీ మంత్రులకు, పార్టీ సీనియర్లకు క్యాబినెట్‌లో ఈ సారి అంతగా చోటు దక్కలేదు. మంగళవారం సాయంత్రం భోర్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ సంగ్రామ్ థోప్తే తనను మంత్రి వర్గంలో చేర్చుకోలేనందుక అసంతృప్తితో పుణె లోని పార్టీ కార్యాలయంపై విరుచుకు పడ్డారు.

శివసేన నేతలు కూడా కొందరు పార్టీ విధేయులకు మాజీ మంత్రులకు ఈసారి అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వెలిబుచ్చారు. సోమవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే 36 మంది మంత్రులతో మంత్రివర్గాన్ని విస్తరించారు. వీరిలో 14 మంది (10 మంది క్యాబినెట్, నలుగురు సహాయ మంత్రులు) ఎన్‌సిపికి చెందిన వారు, సేన నుంచి 12 మంది (8 మంది క్యాబినెట్, నలుగురు సహాయ మంత్రులు), కాంగ్రెస్ నుంచి 10 మంది (8 మందికి క్యాబినెట్, ఇద్దరికి సహాయ మంత్రులు) కి మంత్రి వర్గంలో చోటు లభించింది. మంత్రివర్గం విస్తరించిన కొన్ని గంటల్లోనే అసమ్మతి బయటపడింది. సోమవారం రాత్రి బీడ్ జిల్లాకు చెందిన ఎన్‌సిపి ఎంఎల్‌ఎ ప్రకాష్ సోలంకే తాను రాజకీయాలకు సరిపోనందున మంగళవారం రాజీనామా చేస్తానని ప్రకటించారు.

అయితే ఎన్‌సిపి నేతలు మంగళవారం ఆయనను ఒప్పించి రాజీనామా చేయకుండా తప్పించారు. ఇదివరకు మంత్రులైన రామ్‌దాస్ కదం, దివాకర్ రావోటే, రవీంద్ర వైకర్ తదితరులకు ఈసారి మంత్రివర్గంలో థాకరే అవకాశం కల్పించలేదు. దాంతో శివసేనలో కొన్ని వర్గాల్లో అసంతృప్తి రాజుకుంది. క్రమశిక్షణ పాటించాలని శివసేన కార్యకర్తలకు సీనియర్ శివసేన నేతలు బుజ్జగించినా మాజీ మంత్రి తనాజీ సావంత్‌కు మంత్రి పదవి ఇవ్వలేదని సోలాపూర్ జిల్లాకు చెందిన శివసేన నేత షైలా గోడ్సే పార్టీకి రాజీనామా చేశారు. ఈలోగా సోలాపూర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నితిన్ నగ్నే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రక్తంతో రాసిన లేఖలో మూడు సార్లు ఎంఎల్‌ఎగా గెలిచిన ప్రణితి షిండేకు మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత సుషీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణితిషిండే.

ప్రణితి షిండేకు మద్దతు దారుడైన కాంగ్రెస్ కార్పొరేటర్ షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలను, కార్యకర్తలను సహనం పాటించాలని షిండే విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ మంత్రివర్గం మూడు పార్టీల ప్రతినిధులతో కూడుకుని ఉన్నందున అందరికీ మంత్రి పదవులు కుదర్చడం కష్టమని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధిష్ఠాన నిర్ణయాన్ని తాను అంగీకరిస్తున్నట్టు చెప్పారు. క్యాబినెట్‌లో ఎమ్‌ఎల్‌ఎలు అస్లంషేఖ్, విశ్వజిత్ కదం లకు చోటు లభించడాన్ని ముంబైకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత తీవ్రంగా విమర్శించారు.

వారిద్దరూ ఎన్నికల ముందు బిజెపిలో చేరడానికి ప్రయత్నించారని, ఆ ప్రయత్నాలు ఫలించక కాంగ్రెస్‌లోనే ఉండిపోయారని, అలాంటివారికి మంత్రి వర్గంలో చోటుదక్కడం విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు. పుణె జిల్లా నుంచి మూడు సార్లు ఎంఎల్‌ఎగా గెలిచిన కాంగ్రెస్ విధేయుడు సంగం తోప్తే ని కాదని పశ్చిమ మహారాష్ట్ర ఎంఎల్‌ఎకు మంత్రి పదవి కట్టబెట్టడంపై సీనియర్ కాంగ్రెస్ నేత విమర్శించారు. 288 మంది ఎంఎల్‌ఎలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన ఎమ్‌ఎల్‌ఎలు 56 మంది కాగా, ఎన్‌సిపి 54 మంది, కాంగ్రెస్ 44 మంది ఉన్నారు. ప్రతిపక్షం బిజెపిలో 105 మంది ఎంఎల్‌ఎలు ఉన్నారు.

Uddhav Thackeray expands cabinet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News