Thursday, April 25, 2024

రథం ముగ్గు

- Advertisement -
- Advertisement -

 

నాగభూషణుడు రాజుగా పరిపాలిస్తూ ప్రజలలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. రాజ్యంలో న్యాయపరిపాలన సక్రమంగా నిర్వహించాలని ప్రతి గ్రామంలోనూ న్యాయాధికారిని నియమించారు. దోషులకు శిక్షగా వేసిన అపరాధ రుసుములో సగం ఆ గ్రామ అభివృద్ధికి, మిగిలిన సగం ఖజానాకు చెల్లించవలెనని ఉత్తర్వు జారీ చేసాడు. ప్రజలలో స్వార్థం, కోపం పెరగడం వల్ల ప్రతి చిన్న విషయానికి ఇతరులతో గొడవపడటం, న్యాయాధికారి దగ్గరకు వెళ్లి న్యాయం చెప్పమనడం ఎక్కువయ్యాయి. ఎక్కువ ఫిర్యాదుల్లో ఇద్దరి పొరపాటు ఉండటం వల్ల ఇద్దరికీ జరిమానా విధించసాగారు.

ఒక రోజు కోశాధికారి జరిమానా వల్ల వచ్చిన సొమ్ము లెక్కలు చెబుతూ “మహా రాజా మన రాజ్యంలో అన్ని గ్రామాల నుండి జరిమానా సొమ్ములు వచ్చాయి. కానీ ఇంతవరకు తడుకు పేట గ్రామం నుండి ఒక్క అణా సొమ్ము కూడా రాలేదు అన్నాడు
‘తడుకు పేటలో న్యాయాధికారి ఉన్నాడుగా’
‘ఉన్నాడు మహారాజా’ అన్నాడు కోశాధికారి.
మహామంత్రిని పిలిపించి కోశాధికారి చెప్పిన విషయం తెలుపుతూ ‘మహామంత్రీ, తడుకుపేట గ్రామంలో న్యాయాధికారి దగ్గరకు ఒక్క ఫిర్యాదు కూడా వెళ్ళలేదంట. ఆ ఊరి ప్రత్యేకత
ఏమిటి ” అడిగాడు నాగభూషణుడు.

మహామంత్రికి ఆ ఊరి గురించి పూర్తిగా తెలిసినా ‘మహారాజా వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా చివరి రోజు రథం ముగ్గు వేస్తారు. ఆ గ్రామ మహిళలు వేసే రథం ముగ్గు చూశారంటే మీరే తెలుసుకొంటారు..” అన్నాడు.  నాగభూషణుడు, మహామంత్రితో కలసి మారువేషంలో తడుకు పేట గ్రామానికి బయలుదేరారు.

సూరీడు రాకముందే గ్రామ వీధులలో ఉన్న వారిలో పండుగ ఆనందం చూసాడు. పిల్లలు నూనె దీపాలు చేతిలో ఉంచుకొన్నారు. ఆ వెలుగులో ఆడవారు ముగ్గులు వేస్తున్నారు. ప్రతి ఇంటి ముందు రథం ముగ్గు వేయడం గమనించాడు. ఒక రథం ముగ్గుకు మరో ఇంటి రథం ముగ్గును గీతతో కలిపి యున్నారు

వీధి మొత్తం ఒక రథం మరో రథం ముగ్గుతో కలిపి ఉండటం చూడగానే ‘మహామంత్రీ వీరిలో ఐక్యత చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. భార్యాభర్తలలో కీచులాటలు, కుటుంబంలో కలహాలు, ఇరుగుపొరుగువారి గొడవలు పెదవై న్యాయాధికారి దగ్గరకు వస్తున్న ఈ కాలంలో వీరిలో ఇంతటి ఐక్యత, మంచి గుణాలు ఎలా వచ్చాయి. అంటూ ఆశ్చర్యపోయాడు.

మహారాజా.. ఈ ఊరి న్యాయాధిపతి, గ్రామపెద్ద కలిసి తరచుగా పండితోత్తములను పిలిపించి నైతిక విలువలున్న నీతికథ లను, ఉపన్యాసాలను చెప్పించేవారు. రామాయణ భారత హరికథల కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. మొత్తం మీద గ్రామ ప్రజలలో మంచిని అభివృద్ధి చేసేందుకు వారు చేస్తున్న కృషి విజయవంతమయింది”

‘మహామంత్రీ.. ఈ తడుకు పేట గ్రామ ప్రజల్లా మన రాజ్య ప్రజలలో నైతిక విలువలు పెంపొందడానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి. అందుకు ముఖ్య సలహాదారులుగా ఈ ఊరి న్యాయాధిపతిని, గ్రామ పెద్దను నియమించండి. మరుసటి సంక్రాతికి మన రాజ్యంలో ప్రతి ఊరిలో ఇలాంటి రథం ముగ్గులు చూడాలి’ అన్నాడు నాగభూషణుడు.

ఓట్ర ప్రకాష్‌రావు
9787446026

 

Village moral stories in telugu

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News