Saturday, April 27, 2024

80ఏళ్లు దాటితే ఇంటి నుంచే ఓటు

- Advertisement -
- Advertisement -

దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు
వందేళ్లు దాటిన ఓటర్లు 7,600 మంది
కొత్తగా 8.11 లక్షల కొత్త ఓటర్ల నమోదు
అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని కొన్ని పార్టీలు కోరాయి
148 చెక్ పోస్టులు, ప్రతీ చెక్‌పోస్టు వద్ద సిసిటివి
సి విజిల్ యాప్‌లో ఫోటో పెడితే 100 నిమిషాల్లో చర్యలు
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో తొలిసారిగా 80 ఏండ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన గురువారంతో ముగిసింది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (సిఇసి) ఇతర కమిషనర్లతో కలిసి హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ..ఈ ఏడాదిలో 22 లక్షలకు పైగా ఓట్లను పరిశీలించి తొలగించినట్లు వెల్లడించారు. ఏకపక్షంగా ఓట్లను తొలగించలేదని స్పష్టం చేశారు. ఫామ్ అందిన తర్వాతే ఓట్లను తొలగించినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో స్త్రీ, పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉండటం శుభ పరిణామం అని పేర్కొన్నారు. హైదరాబాద్ మినీ భారత్ లాంటిది. యువ ఓటర్ల సంఖ్య 8 లక్షలు దాటడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. జులై తర్వాత దరఖాస్తు చేసుకున్న 2.21 లక్షల యువతకు ఓటు హక్కు కల్పించామన్నారు. 66 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 18 నుంచి 19 ఏండ్ల యువ మహిళా ఓటర్లు 3.45 లక్షలు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్లు 35,356 ఉండగా, ఒక్కో పోలింగ్ స్టేషన్లో సగటు ఓటర్ల సంఖ్య 897గా ఉందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఆయా పార్టీల సూచనలు, సలహాలను స్వీకరించామన్నారు. ఎన్నికల ఖర్చు పెంచాలని కొందరు అడిగారని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావంపై కొన్ని పార్టీలు ఆందోళన వెలిబుచ్చాయి. అర్బన్ ఏరియాల్లో పరిశీలకులను పెట్టాలని కోరారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరగొచ్చని కొన్ని పార్టీలు ఆందోళన చెందాయి.అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని కొన్ని పార్టీలు కోరాయి. బుధవారం ఓటర్ల తుది జాబితా కూడా వెల్లడించాం. ఫిర్యాదుల స్వీకరణ కోసం సీ విజిల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని రాజీవ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు ఉండగా.. వందేళ్లు దాటిన ఓటర్లు 7,600 మంది ఉన్నారు. 35వేల పోలింగ్ స్టేషన్ల పరిధిలో కొత్తగా 8.11 లక్షల కొత్త ఓటర్ల నమోదు చేసుకున్నారు. 80 ఏళ్ళు దాటిన వారికీ ఇంటినుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నాం.

స్వేచ్ఛ, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ…
యంగెస్ట్ స్టేట్ తెలంగాణ.. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రధాన్యత ఉంది అని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. స్వేచ్ఛ, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం మేము కమిట్మెంట్ తో పనిచేస్తున్నాం వెల్లడించారు. 119 శాసనసభ స్థానాల్లో 88 జనరల్, ఎస్‌టి 12, ఎస్‌సి 19 ఉన్నాయి.. 80 ఏళ్లకు పైబడిన వాళ్ళు 4.43 లక్షలు, 100 ఏళ్లకు పైబడిన వాళ్ళు 7,689 మంది ఉన్నారని వెల్లడించారు. వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేయడానికి ఫామ్ 12డి ఏర్పాటు చేస్తున్నాం.. దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అక్రమంగా నగదు మద్యం సరఫరా చేస్తే సి విజిల్ యాప్ లో ఫోటో పెడితే వంద నిమిషాల్లో చర్యలు తీసుకుంటాం.. ప్రతీ ఒక్కరూ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అని ఆయన తెలిపారు. సువిధ పోర్టల్ ప్రతీ అభ్యర్థి డౌన్‌లోడ్ చేసుకోవాలి.. సమాచారం తెలుసుకోవచ్చు. కెవైసిఅంటే మీ నియోజకవర్గ అభ్యర్థుల క్రిమినల్ బ్యాగ్రౌండ్ చెక్ చేసుకోవచ్చు అని రాజీవ్ కుమార్ చెప్పారు. అంతర్‌రాష్ట్ర సరిహద్దులో 89 చెక్‌పోస్ట్ లు, మొత్తం 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, అందులో కొత్తగా అటవీశాఖ ఆధ్వర్యంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఆన్‌లైన్‌లో నగదు బదిలీలపై నిఘా…
అక్రమంగా నగదు, -మద్యం సరఫరా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి.. ఆన్‌లైన్‌లో నగదు బదిలీల పై ఇసి నిఘా ఉంటుందని రాజీవ్‌కుమార్ వెల్లడించారు. హెలిప్యాడ్స్, ఎయిర్‌పోర్టులో ప్రత్యేక నిఘా ఉంటుంది.. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ప్రతీ వారానికి ఒకసారి రిపోర్ట్ చేయాలని ఆదేశించాం.. ఆరోపణలు (ఫిర్యాదు) వచ్చిన ప్రతీ నాయకులు సమాధానం చెప్పాల్సి ఉంటుందని వెల్లడించారు. ఓటుకు నగదు పంపిణీ ఎక్కువ సంఖ్యలో అనేది మా దృష్టికి వచ్చింది.. రాబోయే ఎన్నికల్లో పటిష్టమైన నిఘా పెడుతున్నామని ఆయన చెప్పారు. ప్రతీ చెక్‌పోస్టు వద్ద సిసిటివిలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ తప్పుడు ఆఫిడవిట్ పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.. ప్రతీ ఆఫిడవిట్ పూర్తిగా ఆన్‌లైన్‌లో పెడుతాం.. న్యాయపరమైన అంశాల్లో జోక్యం చేసుకోమని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కున వినియోగించాలని రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

యువ ఓటర్లు ప్రలోభాలకు లొనుకావొద్దు : సిఇసి
పోలింగ్ సమయంలో యువ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రలోభాలకు ఆస్కారం ఇవ్వకుండా నైతికంగా ఓటింగ్‌లో పాల్గొనాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఓటర్లను చైతన్యపరచడానికి చేపట్టిన స్వీప్ కార్యక్రమంలో భాగంగాటెక్ మహీంద్రా ఆడిటోరియంలో ఓటర్లతో మాటామంతీ కార్యక్రమంలో ఆయనతో పాటు ఇద్దరు కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ పాల్గొని సమాధానమిచ్చారు. ఓటు హక్కు అనేది టాటా, బిర్లాలతో పాటు దేశంలోని ప్రతి పౌరునికి అత్యంత అమూల్యమైన విషయం అన్నారు. శాసనసభ ఎన్నికలలో ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలనీ, అక్రమాలపై నిఘా ఉంచాలనీ కోరారు.

మిగిలిన ఇద్దరు కమిషనర్లు శ్రీయుతులు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్లతో కలిసి ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి ప్రేక్షకులు అడిగిన పలు సందేహాలపై వారు స్పష్టత ఇచ్చారు. ఇష్టాగోష్ఠిలో ప్రముఖ నటి, ఎన్నికల ప్రచార కర్త అక్కినేని అమల మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్లను వివిధ రంగాల ప్రముఖులు, ట్రాన్స్ జెండర్ ప్రతినిధులు, దివ్యాంగులు, ఐటి పరిశ్రమలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, డిఇఓలు ఈ కార్యక్రమంలో చురుగ్గా నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఓటర్లను చైతన్యవంతులను చేయడానికి రాష్ట్ర స్థాయిలో డిజైన్, వీడియో రూపకల్పనలపై పోటీ విజేతలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ బహుమతులు అందచేశారు. గోండు, గుస్సాడీ,చెంచు తదితర సాంస్కృతిక సంఘాలకు చెందిన ప్రతినిధులు వారి ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.

Rajiv Kumar 2

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News