Tuesday, September 23, 2025

కర్నాటక ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో కొత్త ట్విస్ట్

- Advertisement -
- Advertisement -

Karnataka SI Recruitment Scam: Audio Clip Lands BJP MLA in Trouble

బిజెపి ఎంఎల్‌ఎను చిక్కుల్లో పడేసిన ఆడియో క్లిప్పింగ్

బెంగళూరు: కర్నాటకలో పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం ఇప్పుడు అధికార బిజెపి ఎంఎల్‌ఎను చిక్కుల్లో పడేసింది. పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం పొందడానికి సాయం చేసేందుకు ఓ అభ్యర్థినుంచి కనకగిరి బిజెపి ఎంఎల్‌ఎ బసవరాజ్ దురుగప్ప దదేసుగుర్ రూ.15 లక్షలు లంచం తీసుకున్నట్లుగా ఉన్న ఓ ఆడియో క్లిప్పింగ్ ఇప్పుడు ఆయనను చిక్కుల్లో పడవేస్తోంది. 543 పోస్టుల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఈ కుంభకోణంపై సిఐడి దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఎంఎల్‌ఎతో జరిపిన ఫోన్ సంభాషణలో అభ్యర్థి తండ్రి నరసప్ప తన కుమారుడి ఉద్యోగం కోసం ఏడాదిన్నర కిందట ఇచ్చిన 15లక్షల రూపాయలను తనకు తిరిగి ఇచ్చేయాలని ఎంఎల్‌ఎను కోరుతున్నట్లుగా ఉంది. అయితే తాను ఇప్పుడు బెంగళూరులో ఉన్నానని, ఆ డబ్బు ‘ ప్రభుత్వానికి’ ఇచ్చానని, తిరిగి రావడానికి కొంత సమయం పడుతుందని ఎంఎల్‌ఎ అతనికి చెప్పినట్లు ఆ ఆడియో క్లిప్పింగ్‌లో ఉంది.

కాగా ఈ ఆడియో క్లిప్‌లపై కూడా దర్యాప్తు ఏజన్సీలు దర్యాప్తు చేస్తాయని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం ఇక్కడ చెప్పారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై చార్జిషీట్లు కూడా దాఖలు చేయడం జరిగిందని సిఎం అంటూ, కొత్తగా ఏవైనా విషయాలు వస్తే వాటిపై కూడా దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. కాగా వీడియో క్లిప్పింగ్‌లపై ఎంఎల్‌ఎ దదేసుగుర్ స్పందిస్తూ, తాను ప్రజా ప్రతినిధిని అయినందున రెండు పార్టీల మధ్య వివాదాన్ని పరిష్కరించాలని కొందరు వచ్చారని, సమస్యను పరిష్కరిస్తానని మాత్రమే తాను వారికి చెప్పానని అన్నారు. డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ విషయాలను ఆడియో రికార్డు చేసి విడుదల చేసిన వారినే అడగాలని ఆయన చెప్పారు. కాగా ఇప్పుడు ఈ ఆడియో క్లిప్పింగ్ వెలుగు చూడడంతో ఈ కుంభకోణంపై న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ డిమాండ్ చేశారు. ‘ప్రభుత్వానికి డబ్బు ఇచ్చానని ఎంఎల్‌ఎ అంటున్నారు. ప్రభుత్వం అంటే మంత్రా.. ముఖ్యమంత్రా? దీనిపై న్యాయ విచారణ జరగాలి’ అని శివకుమార్ డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News