Monday, April 29, 2024

ఇంజనీరింగ్‌లో 18,210 కొత్త కోర్సుల సీట్లు

- Advertisement -
- Advertisement -

18210 seats in new courses in Emerging

హైదరాబాద్: రాష్ట్రం లో విద్యార్థులు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న కొత్త కోర్సుల సీట్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరం జెఎన్‌టియుహెచ్ పరిధిలోని 18,210 కొత్త కోర్సుల సీట్లకు అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యాసంవత్సరం కొత్త కోర్సుల కోసం అదనంగా రూ.33.85 కోట్ల నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరంలో బి.టెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్ కోర్సులకు ప్రభుత్వం అనుమతించింది.

ఈ కోర్సులలో కొన్ని కళాశాలల్లో 60 సీట్లు అనుమతి లభించగా, మరికొన్ని కళాశాలల్లో 120 సీట్లను అనుమతి లభించింది. కళాశాలలు దరఖాస్తు చేసుకున్న మేరకు కొత్త కోర్సులకు అనుమతులు మంజూరు చేశారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లో భాగంగా ఆదివారం నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో జెఎన్‌టియుహెచ్ పరిధిలోని కొత్త కోర్సుల వివరాలతో పాటు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సీట్ల వివరాలను సాంకేతిక విద్యాశాఖకు పంపించారు. ఈ మేరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గత ఏడాది డిమాండ్ లేని 13,890 పాత సీట్లను ప్రైవేట్ కళాశాలలు సరెండర్ చేయగా, ఈ సారి 18,210 కొత్త కోర్సుల సీట్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ సారి ఇంజనీరింగ్ సీట్లు పెరిగినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News