Sunday, April 28, 2024

కలకలం సృష్టించిన వృద్ధుల కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

2 elderly women kidnapped in SR Nagar

ఎస్‌ఆర్ నగర్ పిఎస్ పరిధిలో సంఘటన
కిడ్నాప్ చేసి అమీన్‌పూర్ పిఎస్ పరిధిలో బంధించిన కిడ్నాపర్లు
స్థానికుల ఫిర్యాదుతో కాపాడిన పోలీసులు

హైదరాబాద్: వృద్ధుల కిడ్నాప్ ఒక్కసారిగా కలకలం సృష్టించిన సంఘటన నగరంలోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….నగరలోని లీలానగర్‌కు చెందిన వృద్ధులు స్థానికంగా ఉంటున్నారు. ఇంటి పక్కన మీరాజ్ అహ్మద్ ఖురేషీ అనే వ్యక్తి గత కొంత కాలం నుంచి ఉంటున్నాడు. ఇద్దరు వృద్ధులు అస్మత్ ఉన్నీసా బేగం(73), మహ్మద్ ఉన్నీసా బేగం సోదరిలు ఉంటున్నారు. వారికి వివాహం కాకపోవడంతో వారు ఉంటున్న ఆస్తిపై కన్నువేశాడు నిందితుడు. వాటిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా మరో నలుగురితో కలిసి వృద్ధులను నగరంలో నుంచి కారులో సామానుతో సహా తీసుకుని వెళ్లి అమీన్‌పూర్ తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో ఇద్దరిని బంధించారు. వృద్ధులు కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధులను రక్షించారు. వారి నుంచి వివరాలు తెలుసుకుని అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కీలకమైన భూమి పత్రాలు, బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లారని బాధితులు తెలిపారు. ధరం కరం రోడ్డులోని లీలానగర్‌లో వృద్ధుల పేరుమీద ఉన్న కోట్లాది రూపాయల ఆస్తిని కాజేసేందుకు నిందితులు కుట్రపన్నారని పోలీసులు తెలిపారు. నలుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు తెలిపారు. ప్రధాని నిందితుడితోపాటు మరో నలుగురు వృద్ధులను కిడ్నాప్ చేశారని ఎస్సై కేశవరావు తెలిపారు. నిందితుల కోసం సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని త్వరలోనే వారిని పట్టుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News