Monday, April 29, 2024

ఉదయనిధి వ్యాఖ్యల వివాదం.. సీజేఐకి 262 మంది ప్రముఖుల లేఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ‘సనాతన ధర్మం’ పై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే దీనిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ 262 మంది ప్రముఖులు , భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఇందులో మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ ద్వేషపూరిత ప్రసంగం చేయడమే కాకుండా, తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారని లేఖలో ప్రస్తావించారు. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్‌ఎన్ ధింగ్రా తదితరులు లేఖలో సంతకం చేసిన వారిలో ఉన్నారు.

‘ డీఎంకే నేత వ్యాఖ్యలు ఆందోళనకరం. ఇది దేశం లోని మెజారిటీ జనాభాకు వ్యతిరేకంగా ‘ద్వేషపూరిత ప్రసంగం’తో సమానం. భారత్‌ను ఒక లౌకిక దేశంగా పేర్కొనే రాజ్యాంగంపై ఇది దాడి చేస్తోంది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించి, చట్టబద్ధ పాలనను అపహాస్యం చేసింది. తీవ్రమైన అంశాలపై చర్యలు తీసుకోవడంలో పాలనాపరంగా జాప్యం … కోర్టు ధిక్కారానికి దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసును సుమోటోగా స్వీకరించాలని సుప్రీం కోర్టును కోరుతున్నాం. ద్వేషపూరిత ప్రసంగాలను నిరోధించేందుకు , శాంతిభద్రతలను పరిరక్షించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ’ అని లేఖలో పేర్కొన్నారు.

నేనూ సనాతన ధర్మానికి చెందిన వాడినే … కేజ్రీవాల్
మరోవైపు ఆప్ జాతీయ కన్వీనర్ , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యవహారంపై స్పందించారు. ప్రజలు అన్నిమతాలను గౌరవించాలని కోరారు. ‘నేనూ సనాతన ధర్మానికి చెందిన వాడిని. మనలో చాలా మంది సనాతన ధర్మానికి చెందిన వారే. ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకోవాలి. దానికి వ్యతిరేకంగా తప్పుగా మాట్లాడకూడదు’ అని వ్యాఖ్యానించారు. ఇలా ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసినప్పటికీ … సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఆపేది లేదని ఉదయనిధి ఇప్పటికే స్పష్టం చేశారు. తనపై ఎలాంటి కేసులు వేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News