Sunday, April 28, 2024

తొక్కిసలాటలో 85 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

సనా : పశ్చిమాసియా దేశం యెమన్‌లో గురువారం జరిగిన తొక్కిసలాటలో కనీసం 85 మంది ఊపిర్లాడక మృతి చెందారు. వందలాది మంది పేదలు, సాయంకోసం ఆశగా వచ్చిన వారు కాళ్లు చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. యెమన్ రాజధాని సనాలో ఓ స్కూల్ ఆవరణలో ఈ ఘటన జరిగింది. వ్యాపారులు కొందరు రంజాన్ నెల చివరి రోజుల నేపథ్యంలో ఆర్థిక సాయం చేస్తోందని తెలియడంతో వేలాదిగా ఈ స్కూల్ వద్దకు గుంపులు గుంపులుగా తరలివచ్చారని, ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. తమకు అందే సాయం వంతు కోసం జనం తోసుకుంటూ వెళ్లడంతో తొక్కిసలాట జరిగిందని వెల్లడైంది. ఈ ఘటనా స్థలిలో హృదయవిదారక దృశ్యాలు కన్పించాయి. ఓ వైపు కింద పడి చనిపోయిన వారిపై నుంచే సాయం కోసం ముందుకు ఉరుకుతున్న వారు, ప్రాణాలు కాపాడుకునేందుకు సురక్షిత స్థలం కోసం వెతుక్కుంటున్న వారితో వారి ఆర్తనాదాలతో ఈ ప్రాంతం అంతా దద్దరిల్లింది.

ఓ చోట పలువురు దాదాపుగా ఎటూ కదలలేని స్థితిలో చిక్కుపడ్డారు. దీనితో వీరి ప్రాణాలు గాలిలో కలిశాయి. సనా ప్రాంతంలోని ఇరాన్ అనుబంధ హౌతీ రెబెల్స్ ఇక్కడ సహాయక చర్యలకు దిగారు. వందలాది మంది గాయపడ్డారని, ఎంత మంది మృతి చెందారనేది పూర్తి స్థాయిలో నిర్థారణ కాలేదని హౌతి సంబంధిత మీడియా తెలిపింది. ప్రతి వ్యక్తికి రంజాన్ దానంగా 5000 యెమెన్ రియాల్స్ ( దాదాపు 9 డాలర్లు) అందచేస్తామని వ్యాపారులు ప్రకటించడంతో దీనిని అందుకునేందుకు జనం తరలివచ్చారు. స్కూల్‌లోపలికి పెద్ద ఎత్తున జనం దూసుకువచ్చారు. తమకు అందిన సమాచారం ప్రకారం కనీసం 322 మంది గాయపడి ఉంటారని , సనాలోని బాబ్ అల్ యెమెన్ జిల్లా ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని స్థానిక మీడియాల వార్తాల ప్రాతిపదికన రాయిటర్స్ తెలిపింది. మృతులను తరలించడం, క్షతగాత్రులను గుర్తించి ఆసుపత్రులకు చికిత్సలకు తరలించడం జరిగిందని హౌతీ ఆధీనంలోని మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు.

సరైన సమన్వయం, తగు విధమైన ఏర్పాట్లు లేకుండానే ఇక్కడ సహాయం అందించేందుకు దిగిన ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. యెమెన్ 2014 నుంచి అంతర్యుద్ధాలతో సతమతమవుతోంది. ఈ క్రమంలో పేదలు, సామాన్య జనం ఉపాధి లేక అల్లాడుతున్నారు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ బలగాలు పలు ఉత్తరాది ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అక్కడి సౌదీ వెన్నుదన్నుల స్థానిక యెమెన్ ప్రభుత్వ వర్గాల పెత్తనం సనా ఇతర చోట్ల లేకుండా చేశారు. అయితే ఇక్కడ పరస్పర ఘర్షణలు జరుగుతూనే వస్తున్నాయి. వేలాది మంది ఈ క్రమంలో చనిపోవడం, 40 లక్షల మంది వరకూ నిర్వాసితులు కావడం జరిగింది. పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పుడు రంజాన్ నెల కావడంతో ప్రతి ఏడాది లాగానే ఇక్కడి వ్యాపారులు తమ రివాజు ప్రకారం పేదలకు సాయం చేస్తూ వస్తున్నారు.ఈ దశలో ఇప్పుడు జరిగిన సాయం ఘట్టం చివరికి జనం తొక్కిసలాటకు వందలాది మంది ప్రాణాలు పోవడానికి దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News