Friday, November 1, 2024

గర్భిణులకూ కొవిడ్ టీకాలు

- Advertisement -
- Advertisement -

covid-19 vaccine for pregnant women

కేంద్రం కీలక అనుమతి

న్యూఢిల్లీ: దేశంలో ఇకపై గర్భవతులు కూడా కొవిడ్ టీకాలు పొందవచ్చు. రోగనిరోధకశక్తి సంబంధిత సాంకేతిక జాతీయ సలహా బృందం (ఎన్‌టిఎజిఐ) ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. దీనితో గర్భవతి తాను కోరుకుంటే కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునే అధికారం దక్కుతుంది. ఇప్పటివరకూ దేశంలో పిల్లలు, గర్భం దాల్చిన మహిళలు కొవిడ్ టీకాలు తీసుకోవచ్చా? లేదా అనే అంశంపై వైద్యశాస్త్రీయపరమైన విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని గర్భిణులు టీకాలు తీసుకునే అంశానికి ఆమోదం తెలియచేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఇకపై గర్భిణులు కొవిన్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. లేదా సమీపంలోని కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్లి టీకాలు వేయించుకోవచ్చు అని, ఈ విషయంలో వైద్య సిబ్బంది నుంచి ఎటువంటి అభ్యంతరాలకు వీలుండదని తెలిపారు.

సంబంధిత నిర్ణయం గురించి వెనువెంటనే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అధికారిక సమాచారం ద్వారా పంపించారు. ఇప్పుడు సాగుతోన్న జాతీయ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణిలకు కూడా టీకాలు వేయడాన్ని పొందుపర్చాలని ఆదేశించారు. ఇప్పటివరకూ చంటిపిల్లల తల్లులు టీకాలు పొందేందుకు వీలుంది. ఇప్పుడు ఈ పరిధిలోకి గర్భవతులను కూడా చేర్చడం వల్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తిగా సమగ్రం, ప్రపంచంలోనే అతి భారీ స్థాయిది అవుతుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గర్భం దాల్చిన దశలో కొవిడ్ సోకినట్లు అయితే అటువంటి వారిలో ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది. ఇతరత్రా వ్యాధులకు గురయ్యే ముప్పు ఉంది. ఇది తల్లికి పుట్టబోయే బిడ్డకు కూడా నష్టం కల్గిస్తుందని అధ్యయనంలో తేలింది. ఈ క్రమంలో అత్యంత సంక్లిష్ట దశలో మహిళకు కరోనా రక్షణ కవచాన్ని కల్పించేందుకు వ్యాక్సిన్ ఉత్తమ పద్దతి అని తేల్చారు. థర్డ్‌వేవ్ భయాల నడుమ వైరస్‌ను అన్నిస్థాయిల్లో కట్టడిచేసేందుకు కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News