హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. కాగా మంగళవారం రాత్రి జి కొండూరు పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా నడిచి చివరికి అది దేవినేని ఉమ అరెస్టుకు దారితీసిన సంగతి తెలిసిందే. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని వెళ్లి, ఆ ప్రాంతాన్ని పరిశీలించి వస్తున్న దేవినేని ఉమ కారు పై దాడి జరిగింది.ఈ దాడి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ అనుచరుల పనేనని టిడిపి ఆరోపించింది. ఈ నేపథ్యంలో జి కొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ, టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కారు లాక్ చేసుకొని ఆందోళన చేస్తున్న దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా పోలీసుల అదుపులోనే దేవినేని ఉమ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉమను బుధవారం నాడు కోర్టు ఎదుట హాజరుపర్చగా న్యాయమూర్తి దేవినేని ఉమకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
TDP Leader Devineni Uma Arrested