తాలిబన్ల అరాచకాలపై ఆమ్నెస్టీ ఆరోపణ
కైరో: అఫ్ఘాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లకు లొంగిపోయిన హజరస్‌కు తెగకు చెందిన 13 మందిని తాలిబన్లు అమానుషంగా చంపివేశారని ప్రముఖ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. అఫ్ఘాన్‌లోని డేకుండి ప్రావిన్సుకు చెందిన కహోర్ గ్రామంలో ఆగస్టు 30న ఈ మారణకాండ చోటుచేసుకుందని ఆమ్నెస్టీ తెలిపింది. హజరస్ తెగకు చెందిన మృతులలో 11 మంది ఇదివరకటి అఫ్ఘాన్ జాతీయ భద్రతా దళాలలో సభ్యులుగా పనిచేశారని, ఇద్దరు పౌరులు, ఒక మహిళ కూడా మృతులలో ఉన్నారని ఆమ్నెస్టీ పేర్కొంది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన రెండు వారాల తర్వాత ఈ సంఘటన చోటుచేసుకుందని ఆమ్నెస్టీ తెలిపింది. అఫ్ఘాన్‌లోని 3.60 కోట్ల జనాభాలో హజరస్ జనాభా సుమారు 9 శాతం ఉంటుంది. సున్నీ ముస్లిముల ప్రాబల్యం గల అఫ్ఘాన్‌లో హజరస్ ప్రజలను మైనారిటీ షియా ముస్లిములుగా పరిగణిస్తారు. 1990వ దశకంలో అఫ్ఘాన్‌ను పాలించిన నాటి అమానుష పాలననే ఇప్పుడు కూడా తాలిబన్లు కొనసాగిస్తున్నారనడానికి హజరస్ ప్రజల ఊచకోతే నిదర్శనమని ఆమ్నెస్టీ సెక్రటరీ జనరల్ అగ్నెస్ కల్లామార్డ్ పేర్కొన్నారు.