Wednesday, May 15, 2024

రాష్ట్రంలో ప్రజా పాలన మొదలయ్యింది

- Advertisement -
- Advertisement -

ఏ కష్టమొచ్చినా ప్రజాభవన్‌కు రావచ్చు
ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికే వినియోగిస్తా
విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తా:  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ ప్రజల పోరాటాలు, త్యాగాల పునాదులపై రాష్ట్రం ఏర్పడిందని, ప్రజా పాలన మొదలైందని సిఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ‘అభయహస్తం’పై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజనికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల (జీఓ)పై రెండో సంతకాన్ని చేసి ఆమెకు అపాయింట్‌మెంట్ లెటర్ జారీచేశారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన వేదిక మీదనే రెండు ఫైళ్లపై సంతకాలు చేసిన రేవంత్‌రెడ్డి గవర్నర్ వెళ్లిపోయిన తర్వాత కృతజ్ఞత సభలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ మేం పాలకులం కాదు సేవకులం అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యిందన్నారు.

నేడు ఉదయం ప్రగతిభవన్‌లో ప్రజాదర్భార్
అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనిందని, అందుకే ఈ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములని, ఒక ముఖ్యమంత్రిగా తాను ఈ మాట ఇస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇంతకాలం ప్రగతి భవన్‌గా ఉన్న భవనం ఇప్పుడు జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌గా మారుతుందని, నేడు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రజాదర్భార్‌కు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికే వినియోగిస్తామని, కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తుపెట్టుకుని గుండెల్లో పెట్టుకుంటానని ఆయన పేర్కొన్నారు. ప్రగతిభవన్ చుట్టూ ఉన్న కంచెను తొలగించామన్నారు. నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలన్నా ప్రగతిభవన్‌కు రావొచ్చని రేవంత్ పిలుపునిచ్చారు.

కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా
రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు అని, సంక్షేమ, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. మీ బిడ్డగా, మీ సోదరుడిగా మీ బాధ్యతలను తాను నిర్వహిస్తానన్నారు. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటానని ఆయన తెలిపారు. పదేళ్లుగా కష్టపడిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటానని, విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తానని రేవంత్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సిఎంలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News