Monday, May 5, 2025

సన్‌రైజర్స్‌కు చావోరేవో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్18లో భాగంగా సోమవారం జరిగే కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ సైన్‌రైజర్స్ ఓటమిపాలైంది. ప్లేఆఫ్ అవకాశాలను మెరుగు పరుచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి హైదరాబాద్‌కు ఏర్పడింది. ఇక వరుస విజయాలతో దూసుకొచ్చిన ఢిల్లీ ప్రస్తుతం వరుస యోటములతో సతమతమవుతోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. అంతకుముందు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ 7 వికెట్లతో విజయం సాధించింది ఢిల్లీ. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు సాగించి విజయంసాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇంతకు ముందు ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని హైదరాబాద్ భావిస్తోంది. అయితే బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో బలంగా ఉన్న క్యాపిటల్స్‌ను ఓడించాలంటే సమష్టిగా రాణించాల్సిందే.
అభిషేక్, హెడ్‌లే కీలకం..
ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు కీలకంగా మారారు. అభిషేక్ శర్మ, హెడ్‌లు ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ రాణించినా మిగతావారు విఫలమయ్యారు. పంజాబ్‌తో జరిగిన పోరులో సయితం అభిషేక్ రాణించాడు. మిగతా మ్యాచుల్లో పూర్తిగా నిరాశ పరిచాడు. కనీసం మిగిలిన పోటీల్లోనైనా అతను తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. హెడ్ కూడా ఆరంభంలో బాగానే ఆడినా తర్వాత పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. హెడ్, అభిషేక్‌లు తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే హైదరాబాద్ బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తేలిపోతాయి.

మరోవైపు ఇషాన్ కిషన్ కూడా చెత్త బ్యాటింగ్‌తో తేలిపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో శతకం తప్పించి ఇషాన్ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇషాన్ పూర్తిగా విఫలం కావడం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఇకపై జరిగే మ్యాచుల్లోనైనా అతను తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగాల్సిన అవసరం ఉంది. ఇక హెన్రిచ్ క్లాసెన్ ఒక్కడే కాస్త నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కమిందు మెండిస్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి తదితరులు కూడా తమ వంతు పాత్ర సమర్థంగా పోషించాలి. బౌలింగ్‌లో కూడా షమి, కమిన్స్, హర్షల్, మెండిస్ తదితరులు సత్తా చాటాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేస్తేనే హైదరాబాద్‌కు గెలుపు సులువనే చెప్పొచ్చు.

తక్కువ అంచనా వేయలేం..
ఢిల్లీ లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించి గాడిలో పడిందనుకున్నా.. అనంతరం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడింది. అయినా తక్కువ అంచనా వేయలేం. ఢిల్లీలో కూడా స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. అభిషేక్ పొరెల్, కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కెప్టెన్ అక్షర్ పటేల్ తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక ముకేశ్ కుమార్, స్టార్క్, కుల్దీప్, అక్షర్‌లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్నఢిల్లీ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగు పరుచుకోవాలని చూస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News