మన తెలంగాణ/షాద్‌నగర్: పోస్టాఫీస్‌లో రూ.19లక్షల నిధులు గోల్‌మాల్ అయిన సంఘటనలో వనపర్తి డివిజన్ పోస్టల్ అధికారులు రికార్డులను తనిఖీ చేశారు. బుధవారం షాద్‌నగర్ పోస్టాఫీస్‌లో డివిజన్ స్థాయి అధికారుల బృందం సభ్యులు రికార్డులను తనిఖీలు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా భూమన్న మాట్లాడుతూ.. షాద్‌నగర్ పోస్టాఫీసులో నిధుల జమ, చెల్లింపుల్లో కొంత జాప్యం చోటు చేసుకోవడంతోపాటు రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయడం లేదని వివరించారు. అనుమానం వచ్చి ఈ రోజు రికార్డులను పరిశీలించగా అసలు విషయాలు బయటకు వచ్చాయని తెలిపారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన నిధులను ఇటు ఆఫీసులో కాగా లేదా పోలీస్ స్టేషన్‌లోనైనా పెట్టాల్సి ఉంటుందని, కానీ ఇవేమి పెట్టకుండా సుమారు రూ.19లక్షల నిధులు దుర్వినియోగం అయినట్లు తమ తనిఖీలో బయటపడినట్లు తెలిపారు.
స్థానిక పోస్టల్ ఉద్యోగిని విచారించగా ఆ నిధులు ఇంటి వద్ద ఉన్నాయని, రెండు రోజుల్లో తీసుకువచ్చి డిపాజిట్ చేస్తానని చెప్పారని భూమన్న వివరించారు. నిర్ణీత సమయంలో నిధులు జమ చేయకుంటే శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరగుతుందని తెలిపారు. పోస్టల్ శాఖకు చెందిన నిధులు మాత్రమే దుర్వినియోగం అయ్యాయని, ఖాతాదారులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని వివరించారు. రోజువారి ప్రక్రియను కొనసాగించేందుకు ఖాతారులు కృషి చేయాలని పేర్కొన్నారు.
షాద్‌నగర్ పోస్టాఫీసులో రోజు రూ.10లక్షల టర్నోవర్
స్థానిక పోస్టాఫీసులో ప్రతిరోజు పది లక్షల వరకు టర్నోవర్ అవుతుందని, ఖాతాదారులు సైతం నిత్యం లావాదేవీలు కొనసాగిస్తుంటారని భూమన్న వివరించారు. స్థానికంగా సిబ్బంది కొరత ఉందని, త్వరలోనే పూర్తి స్థాయిలో నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. షాద్‌నగర్, తిమ్మాపూర్, కొత్తూరు, జడ్చర్ల వంటి ప్రధాన పోస్టాఫీసుల్లో రోజువారి టర్నోవర్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజల నుండి మంచి స్పందన ఉందని పేర్కొన్నారు. పోస్టాఫీసుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అంధిస్తున్న పథకాలను ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ తనిఖీల్లో తపాల శాఖ అధికారులు సైదా నాయక్, గోపినాథ్, పోస్టల్ ఇన్‌స్పెక్టర్లు సుజన్ నాయక్, రవికుమార్‌లు ఉన్నారు.