ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీలు, అడ్డగోలు వాగ్దానాలపై కూడా ఎన్నికల కమిషన్‌తో చర్చించామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఢిల్లీలో భారత ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశానికి కెటిఆర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం హాజరైంది. ఈ సమావేశంలో కెటిఆర్‌తో పాటు రాజ్యసభ సభ్యులు కె.ఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, బాల్క సుమన్ పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీలో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి 420 హామీలు ఇచ్చి, ఒక వేలంపాట లాగా నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు సంపాదించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎలా తప్పించుకుంటుందో ఎన్నికల సంఘానికి వివరించామని తెలిపారు.
అన్ని వాగ్దానాలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి గ్యారెంటీ కార్డులు ముద్రించి, చివరికి స్టాంపు పేపర్ల మీద సంతకాలు పెట్టి, గుడిలో దేవుడి ముందు బాండు పేపర్లు పెట్టి ప్రజలను ఎలా వంచించారో చెప్పామని కెటిఆర్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోకి కట్టుబడి ఉండకపోతే వారిని శిక్షించే బాధ్యత, అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలను వంచించే ఏ పార్టీ అయినా మోసం చేస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేసి, ఎన్నికల్లో పాల్గొనడానికి వీలు లేకుండా అనర్హత వేటు వేయాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవెల్ కమిటీలతో ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో ఉండే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌ను, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ను, తాలూకా స్థాయిలో ఆర్డీవోను, మండల స్థాయిలో ఎండిఓను, గ్రామస్థాయిలో వీఆర్వోను కూడా ఈ ప్రక్రియలో భాగం చేయాలని సూచించామన్నారు. ఎవరి ఓట్లు తీస్తున్నారు.. ఎందుకు తీస్తున్నారు.. ఏ కారణంతో తీస్తున్నారన్న విషయాన్ని అన్ని పార్టీలకు చెప్పి పారదర్శకంగా తీసేయాలని ఎన్నికల కమిషన్‌కు చెప్పామని తెలిపారు.