Friday, August 8, 2025

ఉత్తరకాశీ విలవిల

- Advertisement -
- Advertisement -

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జలవిలయంతో తల్లడిల్లుతోంది. ఈ ప్రాంతంలో వరుసగా గురువారం కూడా భారీ వర్షాలు , ఆకస్మిక వరదలతో 50 మందికి పైగా జాడ తెలియకుండా పొయారు. ఇప్పటివరకూ 70 మందిని అతికష్టం మీద కాపాడి, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సైన్యం అధికారులు తెలిపారు. పర్యావరణ , భౌగోళికపరంగా అత్యంత నాజూకుగా ఉన్న ఉత్తరకాశీలో మంగళవారం సంభవించిన విపత్తుతో ఇప్పటివరకూ కనీసం నలుగురు మృతి చెందినట్లు నిర్థారించారు. జాడ తెలియకుండా పోయిన వారి పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు. ప్రస్తుత పరిస్థితి గురించి అధికార గణం కూడా సరైన నిర్థారిత సమాధానం ఇవ్వడం లేదు. దీనితో గల్లంతు అయిన వారి కుటుంబాలలో తీవ్ర స్థాయి నైరాశ్యం అలుముకుంది. పలు ప్రాంతాలలో భయానక పరిస్థితి మధ్య చిక్కుపడ్డ దాదాపు 65 మందిని హెలికాప్టర్ ద్వారా సురక్షితమైన మాత్లీ టౌన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఇక ఆకస్మిక వరదలతో పూర్తిగా కొట్టుకుపోయిన ఇక్కడి ధారాలి గ్రామంలో హృదయవిదారక పరిస్థితులు ఉన్నాయి. అక్కడ శిథిలాల కింద పలువురు చిక్కుపడి ఉండటం, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడం వంటి ఘటనలు జరిగాయి. దీనితో ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున అధునాతన రీతిలో ఉండే హెలికాప్టర్ తరలింపుల పరికరాలను పంపించారు. వీటి ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యత్నిస్తున్నారు. అయితే పలు స్థాయిల్లో విరుచుకుపడుతున్న ఆకస్మిక వరదలతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇక్కడి దుర్ఘటన గురించి తెలియగానే కేవలం పావుగంటలోనే తమ బలగాలు ధారాలి గ్రామానికి చేరాయని సైనికాధికారులు తెలిపారు. డెహ్రాడూన్‌కు 422 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాత్లీ టౌన్ ముంపు ఇతరత్రా ముప్పునకు అతీతంగా ఉండటంతో బాధితులను అక్కడికి చేర్చే ప్రక్రియ సైన్యం ద్వారా యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేశారు. ఇప్పుడు గల్లంతయిన వ్యక్తుల జాబితాలో పలువురు పౌరులు , తొమ్మండుగురు జవాన్లు , ఓ సైనికాధికారి, ఇతరత్రా సైనిక సిబ్బంది ఉన్నట్లు వెల్లడైంది.

పలు ప్రాంతాలలో ఏ క్షణంలో మెరుపు వేగపు వరదలు వచ్చిపడుతాయో అనే భయాలు వేటాడుతున్నాయి. గాయపడ్డ వారిని ఎక్కువగా డెహ్రాడూన్‌కు ముందుగా తరలించి వెంటనే అక్కడి నుంచి రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు పంపిస్తున్నారు. పలు ప్రాంతాలలో రహదారుల వ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది. గంగోత్రిలో దాదాపు 200 మంది వరకూ యాత్రికులు చిక్కుపడ్డారు. వారికి సైన్యం , ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసు (ఐటిబిపి) నుంచి అవసరం అయిన ఆహారం, ఆశ్రయం , వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో లెఫ్టినెంట్ జనరల్ నవీన్ సచ్‌దేవ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని వివరించారు. తమ బలగాలు అహర్నిశలూ శ్రమించి బాధితులను కాపాడేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రయత్నాలలో తమ వారు పలు విధాలుగా కష్టాలకు గురైనా పౌరుల రక్షణకు ముందుకు సాగుతున్నట్లు వివరించారు. పెద్ద ఎత్తున సహాయక చర్యలలో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఆర్మీ , ఐటిబిపి, స్థానిక పోలీసు బలగాలు పాల్గొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News