అమెరికాలో శాశ్వత నివాస అర్హత కల్పించే గ్రీన్‌కార్డు పొందేందుకు ఓ అరుదైన అవకాశం ఏర్పడింది. ఇతరత్రా అన్ని అర్హతలు ఉండి గ్రీన్‌కార్డు కోసం పది ఏండ్లుగా నిరీక్షిస్తున్న వారు వెంటనే దీనిని పొందేందుకు దగ్గరి దారి ఏర్పడనుంది. ఇటువంటి కేటగిరి వారు గ్రీన్‌కార్డు జారీకి 20 వేల డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ 17.5 లక్షలు చెల్లించుకోవల్సి ఉంటుంది. ఈ చెల్లింపులకు దిగే వారి దరఖాస్తులను తక్షణ రీతిలో ఆమోదానికి పరిశీలిస్తారు. ఈ మేరకు పూర్తి స్థాయి వెసులుబాటు కల్పించే డిగ్నిటీ యాక్ట్ ఆఫ్ 2025 బిల్లును అమెరికా ప్రభుత్వం చట్టసభలలో ప్రవేశపెట్టింది. అమెరికా ప్రతినిధుల సభలో తీసుకువచ్చిన ఈ బిల్లుకు దేశంలోని రెండు పార్టీలు రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మద్దతు ఉంది. దేశంలోకి చట్టబద్ధమైన వలసల క్రమబద్ధీకరణ, దరఖాస్తుల సత్వర పరిశీలన ద్వారా గ్రీన్‌కార్డులు, స్టూడెంట్స్ వీసాల ప్రక్రియలోని తీవ్ర స్థాయి వాయిదాలను నివారించేందుకు ఈ బిల్లు ద్వారా వీలేర్పడుతుంది. బిల్లు ఆమోద ప్రక్రియ పూర్తి అయితే వీసా బ్యాక్‌లాగ్‌ల సమస్యకు 2035 నాటికి పరిష్కారం ఏర్పడుతుందని ఆశిస్తున్నారు.
దీనితో చట్టబద్ధమైన వీసాలు, గ్రీన్‌కార్డుల త్వరితగతి కలల్లో ఉండే భారతీయులు ఇతర కొన్ని దేశాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇక చెల్లింపుల ప్రక్రియ అనేది కీలకం కానుంది. ఈ బిల్లులోనే దేశాల వారిగా వీసాల జారీ పరిమితి పెంచే ప్రతిపాదన కూడా ఉంది. సరైన పత్రాలు ఉండే వారికి సరైన రక్షణ కల్పించేందుకు కూడా పలు ప్రతిపాదనలు చేశారు. స్టూడెంట్ , ఉద్యోగ వీసాల కల్పన సంబంధిత సంస్కరణలకు కూడా తగు వెసులుబాట్లు కల్పించారని చట్టసభ సభ్యురాలు మారియా ఎల్విరా సలజార్ తెలిపారు. బిల్లు ద్వారా ఒక్కో దేశానికి ఇప్పటివరకూ ఉన్న 7 శాతం పరిమితిని 15 శాతానికి పెంచారు. అయితే సరైన పత్రాలు, చట్టబద్ధత బట్టి ఇది వర్తిస్తుంది. ఇక వర్క్ పర్మిట్‌పై వచ్చిన వారి పిల్లలకు శాశ్వత నివాస హోదా కల్పించేలా కూడా బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి. అమెరికా గ్రీన్‌కార్డుల కోసం ప్రతి ఏటా లక్ష వరకూ దరఖాస్తులు ఏళ్ల తరబడి ఎదురుచూపులు సాగుతున్నాయి. భారత్, చైనా , మెక్సికో, పిలిప్పిన్స్ దేశాల నుంచి గ్రీన్‌కార్డుల కోసం పోటీ తీవ్రంగా ఉంది.
ఓ అంచనా మేరకు గ్రీన్‌కార్డులు , వీసాలకు దరఖాస్తులు దాదాపుగా కోటికి పైగా బ్యాక్‌లాగ్‌లో ఉన్నట్లు వెల్లడి అయింది. అన్నింటికి మించి బ్యాక్‌లాగ్ స్థాయిని 2035 నాటికి తగ్గించడమే కీలకం. కాగా ఇప్పుడున్న ఎఫ్ 1 స్టూడెంట్ వీసాలు ఇకపై ద్వంద ప్రయోజనాల డ్యుయల్ ఇంటెంట్‌తో ఉంటాయి. ఈ మేరకు విదేశీ విద్యార్థులు ఇక్కడ ఉద్యోగాలు చేసుకునేందుకు కూడా వీలు ఏర్పడుతుంది. పలు ఇతరత్రా వీసాలకు సంబంధించి కూడా వెసులుబాట్లతో ఈ బిల్లు రూపొందింది. అమెరికా కలలు ఉండే విద్యాధికులకు గౌరవ హుందాకరమైన వీసాల కల్పన, సరైన గ్రీన్‌కార్డులు కల్పించేందుకు ఈ డిగ్నిటీ బిల్లు రూపొందింది. అమెరికా ప్రయోజనాల పరిరక్షణ, ఇదే సమయంలో ఇతర దేశాల నుంచి వచ్చే వారి గౌరవ సంరక్షణ దిశలో వచ్చిన ఈ బిల్లు లెప్ట్ కానీ రైట్ కానీ కాదని, పూర్తిగా సముచితం అని చట్టసభ సభ్యులు తెలిపారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్య పరిష్కార మార్గం అని ఆశాభావం వ్యక్తం చేశారు.