Friday, August 8, 2025

టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్టు సిరీస్‌ను టీమిండియా 22తో సమంగా ముగించిన సంగతి తెలిసిందే. ఏమాత్రం అంచనాలకు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు చిరస్మరణీయ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టును వారి సొంత గడ్డపై నిలువరించి గిల్ సేన ఔరా అనిపించింది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్‌లు అందుబాటులో లేక పోవడంతో సిరీస్ ఆరంభానికి ముందే భారత్‌కు ఇబ్బందులు తప్పక పోవచ్చనే అభిప్రాయాలను సీనియర్ ఆటగాళ్లు, విశ్లేషకులు ఓ అంచనాకు వచ్చారు.

కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ సిరీస్‌లో గిల్ బృందం చిరస్మరణీయ ప్రదర్శనతో పెను సంచలనం సృష్టించింది. మాంచెస్టర్, ఓవల్‌లలో జరిగిన టెస్టుల్లో టీమిండియా ప్రదర్శనను ఎంత పొగిడినా తక్కువే. నాలుగో టెస్టులో ఓటమి ఖాయమని భావిస్తున్న సమయంలో భారత ఆటగాళ్లు అసాధారణ ఆటతో జట్టును పరాజయం నుంచి బయటపడేశారు. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను పట్టేయాలని భావించిన ఆతిథ్య టీమ్ ఇంగ్లండ్ ఆశలపై టీమిండియా నీళ్లు చల్లింది. అంతేగాక తొలి టెస్టులో గెలిచి జోరుమీదున్న ఇంగ్లండ్‌ను బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఓడించి భారత్ ప్రతీకారం తీర్చుకున్న తీరును ప్రశంసించ కుండా ఉండలేం. తొలి మ్యాచ్ నుంచే టీమిండియా అద్భుత ఆటను కనబరిచింది.

మొదటి సిరీస్‌లోనే శుభ్‌మన్ గిల్ తన కెప్టెన్సీ ప్రతిభను చాటాడు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైనా ఇంగ్లండ్‌కు ముచ్చెమటలు పట్టించింది. ఇక రెండో టెస్టులో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. గిల్ మరోసారి చెలరేగి పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో అలరించాడు. టీమిండియా విజయంలో గిల్ తనదైన పాత్రను పోషించాడు. మూడో టెస్టులో కూడా భారత్ అద్భుత ఆటను కనబరిచింది. లార్డ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య టీమ్ ఇంగ్లండ్‌ను దాదాపు ఓడించినంత పని చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కీలక ఆటగాళ్లు కాస్త రాణించి ఉంటే లార్డ్‌లో టీమిండియాకు చారిత్రక విజయం దక్కేది.

ఈ మ్యాచ్‌లో భారత్ అంచనాలకు మించి రాణించినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ అతి కష్టం మీద జయకేతనం ఎగుర వేసింది. మాంచెస్టర్ టెస్టులో కూడా టీమిండియా సత్తా చాటింది. ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని తట్టుకుంటూ మ్యాచ్‌లో నిలబడింది. గిల్, రాహుల్, జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు అద్భుత పోరాట పటిమను కనబరచడంతో ఈ మ్యాచ్‌ను భారత్ డ్రాగా ముగించింది. ఇక ఓవల్‌లో జరిగిన చివరి టెస్టులోనూ టీమిండియా చిరస్మరణీయ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇంగ్లండ్‌ను దీటుగా ఎదుర్కొంటూ మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతేగాక సిరీస్‌ను సమంగా ముగించింది.

సమష్టిగా రాణించడం వల్లే..

సిరీస్‌లో టీమిండియా చిరస్మరణీయ పోరాటంతో అందరిని ఆశ్చర్యానికి గురించింది. తొలి మ్యాచ్ నుంచే అద్భుత ప్రతిభను కనబరిచింది. ఇంగ్లండ్‌కు గట్టి పోటీ ఇస్తూ ముందుకు సాగింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత్ సమష్టిగా రాణిస్తూ లక్షం వైపు అడుగులు వేసింది. సొంత గడ్డపైఎదురులేని శక్తిగా పేరున్న ఇంగ్లండ్‌కు దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ చుక్కలు చూపించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టును ముందుండి నడిపించాడు. ఓపెనర్లు కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, సుందర్, సాయి సుదర్శన్ తదితరులు బ్యాట్‌తో సత్తా చాటారు. సిరాజ్, ఆకాశ్‌దీప్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణలు బంతితో రాణించారు. ఇలా బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో భారత్ సిరీస్‌ను డ్రా చేసి పెను ప్రకంపనలు సృష్టించింది. రానున్న సిరీస్‌లలో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఇది దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News