న్యూఢిల్లీ: ఓట్ల దొంగతనం ఆరోపణలు చేస్తూ వచ్చిన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ గురువారం నాడు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఓట్ల చోరీలో పాల్గొంటున్న వారని రక్షించేందుకు యత్నిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేవారికి అండగా నిలుస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సేకరించిన డేటాను ప్రస్తావిస్తూ, కాం గ్రెస్‌కి చెందిన ఓటర్లనే లక్ష్యంగా చేసుకుని ఓ క్రమ పద్ధతిలో వారి పేర్లను తొలగిస్తున్నారని రాహుల్ విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటు దొంగలను రక్షించడం మాని, ఓటర్ల తొలగింపు పై కర్ణాటక సీఐడి దర్యాప్తులో కోరిన సమాచారాన్ని వారం రోజుల్లో అందజేయాలని ఆయన హితవు పలికారు. లేనిపక్షంలో ఎన్నికల కమిషన్ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడిందని రుజువు కాగలదన్నారు. ఎన్నికల కమిషన్ పై తీవ్ర దాడికి సిద్ధమైన రాహుల్ గాంధీ ఢిల్లీలోని కాంగ్రెస్ ఇందిరా భవన్ లో విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు.
రాజ్యాంగ సంస్థలు సక్రమంగా పనిచేయడం లేదని, అధికార పక్షానికి కొమ్ము కాసే స్థితికి దిగజారాయని ఆయన ఆరోపించారు. గతంలో తాను వాగ్దానం చేసినట్లు ఇది హైడ్రోజన్ బాంబు కాదని, త్వరలోనే అసలైన వివరాలు వెల్లడిస్తానని మీడియా సమావేశం ఆరంభంలోనే రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను టార్గెట్ చేస్తూ, సిఈ సి ఓటు దొంగలను, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులను రక్షిస్తోందని రాహుల్ ఆరోపించారు. ఈ అం శాన్ని తాను ఆషామాషీగా చెప్పడం లేదని స్పష్టం చేశా రు. ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటానికి తాను పునాది వేస్తున్నానని పేర్కొంటూ, భారతదేశ ప్రజాస్వామ్యం హై జాక్ చేయబడిందని, ప్రజలే ప్రజాసా్వామ్యాన్ని రక్షించుకొంటారని రాహుల్ అన్నారు. ప్రజాస్వామ్యానికి చేటు కలుగుతున్నదని ప్రజలు గ్రహించిన రోజున ఆ పని పూర్తవుతుందని తెలిపారు. కర్ణాటకలోని అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6,016 ఓట్లను తొలగించడానికి జరిగిన ప్రయత్నాలను ఆయన బయటపెట్టారు.
మహారాష్ట్రలోని రజురా నియోజకవర్గంలో ఆటో మాటెడ్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి, 6,850 మంది ఓటర్లను మోసపూరిత పద్ధతులలో చేర్చారని రాహుల్ వివరించారు. కేంద్రీకృత వ్యవస్థతో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రలలో ఇలాగే జరిగిందని, హర్యానా, ఉత్తరప్రదేశ్ , బీహార్ లలో కూడా అలాగే చేసిందని ఇందుకు తమ వద్ద రుజువులు ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తాను ఒకటే డిమాండ్ చేస్తున్నానని, రాజ్యాంగం ప్రకారం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని ప్రమాణం చేశారని, దానిని నిలుపుకోవాలని, అలాగే, ఎలాంటి పక్షపాతం లేకుండా కర్ణాటక సిఐడి కోరిన వివరాలు ఇవ్వాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కర్ణాటక అలంద్ నియోజకవర్గంలో కేవలం కాంగ్రెస్ బలంగా ఉన్న పోలింగ్ బూత్ లను లక్ష్యంగా చేసుకుని ఓట్లను తొలగించారని రాహుల్ గాంధీ అన్నారు. పెద్దఎత్తున ఓటర్ల పేర్ల తొలగింపు జరిగింది. 10 బూత్ లు కాంగ్రెస్ కు బలమైనవి. 2018లో 10 బూత్ లలో ఎనిమిదింటిని కాంగ్రెస్ గెలుచుకుంది. ఇది యాద-చ్ఛికంగా జరిగింది కాదు.
ప్రణాళికా బద్ధమైన ఆపరేషన్ ఆని ఆయన ఆరోపించారు. కొంతమంది వ్యక్తులు లక్షలాది మంది ఓటర్లను, ముఖ్యంగా మైనారిటీలు, దళితులను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని గాంధీ పేర్కొన్నారు. తాను ప్రతిపక్షనాయకుడిగా 100 శాతం రుజువు లేకుండా ఆరోపణలు చేయబోనని అన్నారు. తాను దేశాన్ని, రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నానని పేర్కొన్నారు. తాను ప్రజాస్వామ్య ప్రక్రియను ఇష్టపడుతున్నానని, ఆ ప్రక్రియను రక్షించాలన్నదే తన తాపత్రయమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అలంద్ సెగ్మెంట్ లో ఎవరో 6,018 ఓట్లను తొలగించడానికి ప్రయత్నించారని, దానిని యాదృచ్ఛికంగా పట్టుకున్నారని, కాంగ్రెస్ ఓటర్ల పేర్లను క్రమపద్ధతిలో తొలగిస్తున్నారని ఆయన అన్నారు. కర్ణాటక వెలుపల నుంచి మొబైల్ నంబర్లను ఉపయోగించి, ఆటోమాటిక్ గా 6,018 దరఖాస్తులు దాఖలైన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
ఓట్ల చోరీపై మూడు నెలల పరిశోధన
తమ పార్టీ చేపడుతున్న ఓటు చోరీపై పరిశోధన, ప్రజెంటేషన్లకు మూడు నెలలు పడుతుందని రాహుల్ పేర్కొన్నారు. ఈ ప్రెజెంటేషన్ పూర్తి చేసేలోగా, రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రం, లోక్ సభ తర్వాత లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయని, మరో పక్క ఓట్లచోరీ కొనసాగుతోందని అన్నారు. దేశ ప్రజలకు సత్యాన్ని తెలియజేయడమే తన పని అని రాహుల్ గాంధీ అన్నారు. దేశ ప్రజల హక్కులను రక్షించాల్సిన బాధ్యత దానిని రక్షించే సంస్థలది అంటూ, వారు ఆ పని చేయడం లేదన్నారు. తాను రాజ్యాంగాన్ని రక్షించేందుకే కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఓట్ల చోరీ వ్యవహారంలో సూత్రధారి ఎవరు అని అడిగినప్పుడు దానిని కూడా ప్రజల ముందు ఉంచుతానని తెలిపారు. తన హైడ్రోజన్ బాంబు వెల్లడితో అందరి రంగులు బయటపడతాయని గాంధీ తెలిపారు. గతనెలలో కర్ణాటక లోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్లను తారుమారు చేయడంద్వారా ఓట్లచోరీ జరిగిందని. గుర్తు చేస్తూ, 2024 లోక్ సభ ఎన్నికల డేటాను ఉదహరించారు. ఓట్ల చోరీ అనేది మన ప్రజాస్వామ్యంపై అణుబాంబు లాంటిదని అన్నారు.
Also Read: హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు..నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది: కిషన్‌రెడ్డి