Saturday, September 20, 2025

వాహన కొనుగోలుదారులపై భారం మోపడం సిఎం ప్రజావ్యతిరేక వైఖరికి నిదర్శనం

- Advertisement -
- Advertisement -

పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే వాటిని అమలు చేయాల్సింది పోయి, వాహన కొనుగోలుదారులపై భారం మోపడం ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక వైఖరికి నిదర్శనం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి రోడ్ సేఫ్టీకి నిధులు కేటాయించి భద్రతా ప్రమాణాలను పెంచకుండా ఇలా అమాయక ప్రజలపై భారం మోపడం అత్యంత దారుణం అని మండిపడ్డారు. హైడ్రా వంటి దిక్కుమాలిన విధానాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టి, ఇప్పుడు ఆ లోటును పూడ్చలేక సామాన్య ప్రజలపై విరుచుకుపడటం దుర్మార్గమైన చర్య అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రహదారి భద్రతా సెస్ పేరిట ఒక్కో కొత్త వాహనం కొనుగోలుపై ఏకంగా రెండు నుంచి పది వేల వరకూ అదనపు భారం వేయడం పేద, మధ్యతరగతికి చెందిన ప్రజానీకాన్ని దగా చేయడమే అని ఆరోపించారు. రెండేళ్లు కావస్తున్నా ఇవ్వాల్సిన గ్యారెంటీలను గాలికొదిలేసి, చివరికి ప్రజల నుంచే ముక్కుపిండి రూ.270 కోట్లు వసూలు చేసే కుట్ర చేస్తే కాంగ్రెస్ సర్కారును ప్రజలు క్షమించరు అని పేర్కొన్నారు. పైసా పైసా కూడబెట్టుకుని, అప్పు చేసి మరీ వాహనం కొనుగోలు చేసే వారి జేబులు కొట్టే ఇలాంటి పన్నాగాలకు కాంగ్రెస్ సర్కారు ఇకనైనా స్వస్తి పలకాలని కెటిఆర్ హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News