పాత పెన్షన్ విధానంలో అన్ని ప్రభుత్వాలు జార్ఖండ్ బాటలో నడవాలని ఎన్‌ఎంఓపిఎస్ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ అన్నారు. శనివారం జార్ఖండ్ రాష్ట్రంలోని నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్స్ ఆధ్వర్యంలోని జార్ఖండ్ ఆఫీసర్స్ టీచర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (జార్ఖండ్ సిపీఎస్ యూనియన్) జార్ఖండ్ సిపీఎస్ యూనియన్ విక్రాంత్ అధ్యక్షతన జరిగిన ఉద్యోగ ఉపాధ్యాయుల కర్మచారి సంపర్క్ మహా సమ్మేళన్ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా స్థితప్రజ్ఞ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచన్ దియాతో జాన్ బలే హీ చలిజాయే వచన్ న చోడే అన్న విధంగా ఒక్కసారి వాగ్దానం చేస్తే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మాట మాత్రం తప్పొద్దు అన్న విధంగా ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ పాత పెన్షన్ విధానం అమలు చేశారన్నారు.
జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్‌ఎంఓపియెస్ ఆధ్యర్యంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానము ను 2022లో రద్దు చేసి, నేడు కూడా పాత పెన్షన్ విధానాన్ని అవలంబిస్తున్న రాష్ట్రమన్నారు. ఎన్‌ఎంఓపిఎస్ సభలో పాత పెన్షన్ అమలు చేస్తామని మాట ఇచ్చి, అమలు చేసి, నేడు రిటైర్ అయిన సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేసి పెన్షన్ పేమెంట్ ఆర్డర్లు ఇవ్వడం చారిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు. సిపిఎస్ అమలుతో ఉద్యోగ ఉపాధ్యాయులు రుణపడి ఉంటారని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు జార్ఖండ్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు, మిగిలిన సమస్యలను సకాలంలో పరిష్కరిస్తున్నందుకు ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జార్ఖండ్ రెవెన్యూ శాఖ మంత్రి దీపక్ బీరువా, ఉన్నత టెక్నికల్ విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్, జార్ఖండ్ రాజ్యసభ ఎంపీ మహోవా, జార్ఖండ్ సిపిఎస్ ప్రధాన కార్యదర్శి ఉజ్వల్ తివారి తదితరులు పాల్గొన్నారు.