* త్వరలో మరిన్ని మహిళా సంఘాలకు అవకాశం
* కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
* మహిళా ’ శక్తి’ కి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం
* మహిళలు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు
* గత పది సంవత్సరాలు మహిళా సంఘాలను పట్టించుకున్న నాథుడు లేడు
* ఉచిత బస్సు ప్రయాణాలతో మహిళలకు రాష్ట్రంలో రూ.7,000 కోట్లు ఆదా
* మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మెప్మా ద్వారా 41.51 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు మొత్తం చెక్కు రూపంలో అందచేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 8,130 మంది మహిళలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నారని డిప్యూటీ సీఎం వివరించారు. —-మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొని అత్యంత శక్తివంతులుగా ఇదిగేందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్ గూడాలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి 63 లక్షల మంది సభ్యులు ఉంటే జిహెచ్‌ఎంసి పరిధిలో 30 సర్కిల్స్‌లో 50,764 సంఘాల్లో 5,09,957 మంది సభ్యులు ఉన్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సంఖ్యను రాబోయే రోజుల్లో గణనీయంగా పెంచుతామని వెల్లడించారు.
హైదరాబాద్ పట్టణంలో పేద మధ్యతరగతి వర్గానికి చెందిన అనేక కుటుంబాలు భర్తతోపాటు భార్య ఏదో ఒక చిరు వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా నిలబడుతున్నారని తెలిపారు. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల దగ్గర పది రూపాయల వడ్డీకి పెట్టుబడులు తెచ్చుకుంటున్నారని, వీరు చేసిన వ్యాపారం వడ్డీలు కట్టడానికే సరిపోతుందన్నారు. ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు పోతుందని తెలిపారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాలని నిర్ణయిస్తే ప్రతిపక్షాలు, కొద్దిమంది వ్యక్తులు ఇది సాధ్యమేనా అంటూ అవహేళన చేశారని గుర్తు చేశారు. వారందరి అంచనాలు తలకిందులు చేస్తూ మొదటి సంవత్సరమే 21,632 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందించి రికార్డు సృష్టించామని, ఇది మా సంకల్పబలం అన్నారు.
మీ శ్రమ వృధా కాదు : రాబోయే రోజుల్లో మహిళా సంఘాల సభ్యులు పెట్టుబడుల కోసం ఏ వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదన్నారు. మీ శ్రమ వృధా కాదని, డ్వాక్రా సంఘాల్లో ఎంతమంది సభ్యులుగా చేరాలనుకుంటే వారందరినీ చేర్చుకుంటామని భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ మహానగరం తోపాటు రాష్ట్రవ్యాప్తంగా గత పది సంవత్సరాలు వడ్డీ లేని రుణాల అంశాన్ని, మహిళా సాధికారతను గాలికి వదిలేశారని అన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి ప్రారంభించిందని వివరించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో హైదరాబాదులో ఖరీదైన శిల్పారామం మహిళలు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా వద్ద వంద దుకాణాలను ప్రజా ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.
మరో 450 బస్సులు త్వరలోనే లీజుకు : మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి లీజుకు ఇప్పిస్తుందని, ఇప్పటికే 150 బస్సులు లీజుకు ఇప్పించామని, మరో 450 బస్సులు త్వరలోనే లీజుకు కు ఇప్పించే కార్యక్రమం జరుగుతుందన్నారు. మహిళలను మహాలక్ష్మిలుగా చూడాలన్నదే ప్రభుత్వం ఆలోచన అందుకే వారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించామని డిప్యూటీ సీఎం తెలిపారు. పిల్లలను బడికి పంపడం వైద్యం కోసం ఆసుపత్రికి, గుడికి ఇలా ఏ అవసరం కోసం అయినా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఇది ఉచితంగా జరిగే కార్యక్రమం కాదు ఇప్పటివరకు 222.50 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారని, వారి పక్షాన అందుకు సంబంధించిన 7,422 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని వివరించారు. ఉచిత బస్సు ప్రయాణాలతో మహిళలకు ఈ రాష్ట్రంలో 7,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఆదా అయ్యాయని భట్టి విక్రమార్క వెల్లడించారు.
పది లక్షల వరకు ఉచిత వైద్యం : రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఏ కార్పొరేట్ ఆసుపత్రిలోనైనా పది లక్షల వరకు ఉచిత వైద్యం చేయించుకునే సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని భట్టి విక్రమార్క అన్నారు. బహిరంగ మార్కెట్లో కిలో 50 రూపాయలు పలుకుతున్న సన్నబియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా అందచేస్తుందని భట్టి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 96 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ జరుగుతుందన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం, రేషన్ కార్డుల్లో పేర్ల మార్పు కోసం పది సంవత్సరాలుగా తిరిగి తిరిగి అలసిపోయారని, ప్రజా ప్రభుత్వం రాగానే కొత్త కార్డులు మంజూరు చేయడంతో పాటు పేర్ల మార్పులు చేర్పులు చేపట్టిందని చెప్పారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, పేదల పక్షాన రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు నెల నెలా కరెంటు బిల్లులు చెల్లిస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.
Also Read: యువత రాజకీయాల్లోకి రావాలి:కెటిఆర్