* హెచ్-1బీ వీసా రుసుంను ఏటా లక్ష డాలర్లకు పెంచితే కేంద్రం ఎందుకు మౌనం
* హెచ్ 1బీ వీసా పొందేవారిలో72 నుంచి 73 శాతం మంది భారతీయులే
* ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు మోదీకే తెలియాలి
* హెచ్-1బీ వీసా ఫీజును పెంచితే స్పందించకపోవడం వెనుక మర్మమేంటి..?
* అమెరికాతో చర్చించి సమస్యను పరిష్కరించడంలో విఫలం
* తెలంగాణపై తీవ్ర ప్రభావం…కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ
* రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు ప్రధాని మోదీకే బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హెచ్-1బీ వీసా రుసుంను ఏటా లక్ష డాలర్లకు పెంచితే కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుంది…? దీని వెనుకున్న మర్మమేంటి…? అని శనివారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన ప్రశ్నించారు. హెచ్ – 1బీ వీసా పొందేవారిలో సుమారు 72 నుంచి 73 శాతం మంది భారతీయులేనని, ఈ ప్రభావం భారత్ పైనే అధికం ఉంటుందని వివరించారు. 2024- 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ కు రికార్డు స్థాయిలో 135.46 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ వచ్చాయని ఇందులో అమెరికా వాటా 27.7 శాతం అన్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో మనకొచ్చే రెమిటెన్స్ తగ్గిపోతాయని, ఆ ప్రభావం మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై పడుతుందని చెప్పారు. ఈ విషయం తెలిసినా ముందస్తుగా అమెరికాతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం చొరవ చూపలేదని, కనీసం ప్రస్తుతం ఉన్న అమెరికాలో ఉన్న హెచ్- 1బీ వీసాదారులకు మినహాయింపులను సాధించడంలోనూ విఫలమయ్యిందని విమర్శించారు.
భారత్ కు నష్టం చేకూర్చేలా ఇప్పటికే 50 శాతం టారిఫ్ : నష్టం చేకూర్చేలా ట్రంప్ ఇప్పటికే 50 శాతం టారిఫ్ విధించారని, ఇప్పుడేమో హెచ్ – 1బీ వీసా ఫీజును పెంచారని అన్నారు. మన ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం స్పందించడం లేదన్నారు. పైగా ఇది మన మంచికే అంటూ వ్యాఖ్యనించడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి మేల్కోని సమస్య పరిష్కారానికి నేరుగా అమెరికాతో చర్చించాలని కోరారు. కనీసం ఇప్పటికే అక్కడున్న హెచ్1బీ వీసాదారులకు తాత్కాలిక మినహాయింపు కల్పించడంపై దృష్టి సారించాలని, భారతీయ ఐటీ నిపుణులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. రెమిటెన్స్ పై ఆధారపడే కుటుంబాలు, సంస్థల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని,
భారతదేశానికి వచ్చే మొత్తం రెమిటెన్స్ లో తెలంగాణ దేశంలో 8.1 శాతం వాటాతో నాలుగో స్థానంలో ఉందని, ట్రంప్ నిర్ణయం వల్ల అధికంగా ప్రభావం పడే రాష్ట్రాల్లో మనది ఒకటని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రం దృష్టికి తీసుకెళుతూ ప్రత్యేకంగా లేఖ రాస్తామని వివరించారు. రాష్ట్రాల హక్కులను హరించడంలో బిజీగా ఉన్న కేంద్రానికి మన భారతీయుల గురించి ఆలోచించే తీరిక లేదని ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం భారతదేశం అంటే రాష్ట్రాల సమూహం అని, కేంద్రానికి మాత్రం బీజేపీ అధికారంలో ఉన్న వాటినే రాష్ట్రాలుగా పరిగణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విషయంలోనూ తెలంగాణను రాష్ట్రంగా పరిగణించడం లేదని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని మంత్రి శ్రీధర్‌బాబు వాపోయారు.
Also Read: యువత రాజకీయాల్లోకి రావాలి:కెటిఆర్