కాంగ్రెస్‌లోకి వెళ్లే ఆలోచన నాకు లేదు
బిఆర్‌ఎస్ నేతలు చాలామంది నాతో టచ్‌లో ఉన్నారు
కాళేశ్వరం అంశంలో తప్ప హరీష్‌రావుపై వేరే కోపం లేదు
ఎంఎల్‌సి పదవికి స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా చేశాను
ఆమోదించకుండా చైర్మన్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలియదు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
చింతమడకలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటానని వెల్లడి
రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ చోటివ్వరు అని, తొక్కుకుంటూ ముందుకు వెళ్లాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు విషయమై ఇంకా ఆలోచించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోకి వెళతారన్న ప్రచారాన్ని కవిత తిప్పికొట్టారు. తనకు ఆ ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనను సంప్రదించలేదని తేల్చిచెప్పారు. సిఎం ఎందుకలా అంటున్నారో తెలియదు అని, భయపడుతున్నారేమో…? అని పేర్కొన్నారు. తనతో టచ్‌లో ఉన్న బిఆర్‌ఎస్ నేతలు లిస్టు చాలా పెద్దది అని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో శనివారం కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు.అనంతరం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, కీలక అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కాళేశ్వరం అంశంలో తప్ప హరీష్‌రావుపై తనకు వేరే కోపం లేదని అన్నారు. ఇరిగేషన్‌పై 2016లోనే తన అన్న కెటిఆర్ సూచించానని గుర్తు చేశారు. కిందిస్థాయి కమిటీ పరిశీలన, ఆమోదం లేకుండానే నేరుగా సిఎంకే ఫైళ్లు వెళ్తున్నాయని కెటిఆర్‌కు చెప్పానని అన్నారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్‌కు హరీష్‌రావు అదే విషయం చెప్పారని, ఆ కమిషన్ నివేదిక చూస్తే అన్నీ అర్థమవుతున్నాయని చెప్పారు.
అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు
బిఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా, హరీష్ రావు సోషల్ మీడియా, సంతోష్ రావు సీక్రెట్ మీడియా తన మీద దాడి చేస్తున్నాయని కవిత ఆరోపించారు. అందరూ తననే.. టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. బిసి రిజర్వేషన్లపై ప్రభుత్వం తగిన నిర్ణయం సిఎం తీసుకోపోతే నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. 42 శాతం బిసి రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోకుంటే.. ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్ళను ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా చేసినట్లు చెప్పారు. తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్‌ను కోరినట్లు పేర్కొన్నారు. రాజీనామాకు వారెందుకు ఆలస్యం చేస్తున్నారో తనకు తెలియదని తెలిపారు.
బిఆర్‌ఎస్ ద్వారా వచ్చిన పదవి ఆనాడు వద్దనుకున్నాను.. ఇప్పుడు వద్దనుకుంటున్నానని అన్నారు.ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చని, ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలుంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. ఎంతమంది జై బిసి అంటే..అంత మంచిదని పేర్కొన్నారు. బిసిల కోసం అందరం కలసి కొట్లాడుదామని పిలపునిచ్చారు. ఇష్యూ మీద మాట్లాడితే సమాధానం ఇస్తాను.. వ్యక్తిగతంగా విమర్శలు సరికావని పేర్కొన్నారు. సొంత ఊరు ఆహ్వానం ఎప్పుడూ ప్రత్యేకమే అని.. చింతమడకలో బతుకమ్మ వేడుకలకు వెళ్ళటం వెనుక రాజకీయం ఏమీ లేదని స్పష్టం చేశారు. గతేడాది రాజకీయంగా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నానని, అందుకే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనలేదని వివరించారు. బతుకమ్మ పండుగకు ఒకటి కాదు.. రెండు బతుకమ్మ చీరలు ఇస్తామని సిఎం రేవంత్ అన్నారని గుర్తు చేశారు. బతుకమ్మ పేరుతో మహిళలకు చీరలు ఇవ్వాలి…కానీ, ఇందిరమ్మ పేరుతో మాత్రం ఇవ్వొద్దని కవిత డిమాండ్ చేశారు.
ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణాలో క్రికెట్ ఆడుకోవచ్చు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఆల్మట్టి డ్యాం హైట్ పెరగకుండా అప్పుడే సుప్రీం కోర్టు స్టే విధించిందని, సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైందని కవిత తెలిపారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం వెళ్లకుంటే జాగృతి తరఫున అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. మహారాష్ట్ర ఇప్పటికే స్పందించి కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకోవడం తప్ప ఏమీ ఉండదని విమర్శించారు.బనకచర్లపై కోర్టుకు వెళతామని అన్నారు. పదేళ్లలో ఆర్‌డిఎస్, తుమ్మిళ్ల, పాలమూరు- రంగారెడ్డి పూర్తి చేసుకోలేకపోయామన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ విచారణకు సిఎం రేవంత్ రెడ్డి వెళ్లాలని చెప్పారు.
Also Read: మహిళలకు రూ.41.51 కోట్ల వడ్డీ లేని రుణాలు