రెండవ కాన్పులో కూడా మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో ఆ మహిళకు కష్టాలు మొదలయ్యాయి. కొడుకు పుట్టలేదనే సాకుతో ఒకవైపు అత్తా మామ మరోవైపు భర్త ఈసడింపులు తోడు కావడంతో ఆ మహిళకు వారు పెట్టే ఇబ్బందులు గుదిబండలాగా మారాయి. దీంతో వారంతా కలిసి ఆమెను వద్దు అంటూ ఇంటి నుంచి గెంటేశారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన పేర్ల కుశలవ, సుజాత దంపతుల కూతురు అనురాధకు తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన మట్టపల్లి నర్సయ్య, వెంకటమ్మ దంపతుల కుమారుడు మధుతో 2012లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టే వరకు కాపురం సజావుగానే సాగింది. అప్పటి నుండి అత్తింటి వారి వేధింపులు కోడలికి మొదలయ్యాయి. ఆడపిల్లలు పుట్టారనే నెపంతో అత్తింటివారు తమ కొడుకును విడిచి వెళ్లిపోవాలని మానసికంగా, శారీరకంగా హింసించేవారు. ఈ సందర్భంగా భార్యాభర్తల పంచాయితీ పోలీసు స్టేషన్ నుండి పెద్ద మనుషుల వరకు చేరింది. కానీ, సమస్య పరిష్కారం కాలేదు.
అలాంటి పరిస్థితిల్లో పుట్టింటికి వెళ్లిన అనురాధ శుక్రవారం తన అత్తింటికి ఇద్దరు బిడ్డలతో కలసి వచ్చింది. భార్య, పిల్లలను ఆమె భర్త మధు, అతని తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వకపోవంతో ఇంటి ఆరు బయట రాత్రి తన ఇద్దరు బిడ్డలతో కలసి ఇంటి ముందు న్యాయం చేయాలని కూర్చుంది. దీంతో మాజీ జడ్‌పిటిసి, సిపిఎం మహిళా నాయకురాలు తాటి విజయమ్మ చొరవ తీసుకొవడంతో ఇంట్లోకి ప్రవేశించింది. ఇదిలావుండగా, బాధిత మహిళ భర్త మధు గుట్టుచప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకున్నాడని తెలియడంతో మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు. మొదటి భార్య సమస్య పరిష్కారం కాకుండానే చట్ట వ్యతిరేకంగా రెండో వివాహం చేసుకున్న మధును చట్ట రీత్యా శిక్షించి బాధిత మహిళకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున కోరుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో సమస్యను పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకుంటామని మధు తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో అనురాధతో పాటు ఆమె ఇద్దరు ఆడపిల్లలను ఇంట్లోకి తీసుకెళ్లారు.
Also Read: మహిళలకు రూ.41.51 కోట్ల వడ్డీ లేని రుణాలు