Sunday, September 21, 2025

ప్రపంచశాంతి గగనకుసుమమే?

- Advertisement -
- Advertisement -

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న ప్రపంచ దేశాలు అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పాటిస్తాయి. ఈ రోజున కాల్పుల విరమణ, అహింస, సోదరభావం, శాంతిసాధన కోసం ఐక్యరాజ్యసమితి దేశాలను ఒక వేదికపైకి తీసుకొస్తుంది. 1981లో కోస్టారికా ప్రతిపాదించిన తీర్మానం ప్రకారం తొలిసారిగా 1982లో ప్రపంచ శాంతి దినాన్ని జరుపుకోగా, 2002లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 21నే శాశ్వతంగా శాంతి దినోత్సవంగా గుర్తించింది. ప్రపంచ చరిత్రలో రెండు మహాయుద్ధాలు మానవాళిని అమితంగా దెబ్బతీశాయి. 1914-1918 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 1.7 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. 1939- 1945 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో 7 కోట్ల మంది మరణించారు. హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబుల వర్షం మానవజాతి చరిత్రలో చెరగని మచ్చగా మిగిలింది.

ఈ విధ్వంసకర పరిస్థితుల్లో భవిష్యత్తులో యుద్ధాలను నివారించడానికి, మానవాళిని రక్షించడానికి ఒక అంతర్జాతీయ వేదిక అవసరమని ప్రపంచ నాయకులు తేల్చారు. లీగ్ ఆఫ్ నేషన్స్ ఆ లక్ష్యాన్ని నెరవేర్చడంలో విఫలమైపోయినందున దాని స్థానంలో 1945 అక్టోబరు 24న ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించింది. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు 51 దేశాలు సభ్యులుగా చేరగా, ప్రస్తుతం 193 దేశాలు సభ్యత్వం పొందాయి. ప్రధాన కార్యాలయం అమెరికా న్యూయార్క్‌లో ఉంది. ఐరాసకు సర్వప్రతినిధి సభ, భద్రతా మండలి, ఆర్థిక -సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, కార్యదర్శితనం అనే ఆరు అంగాలు ఉన్నాయి. భద్రతా మండలిలో మొత్తం 15 సభ్యదేశాలలో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ శాశ్వత సభ్యులుగా ఉన్నారు. వీరి వద్ద ‘వీటో’ హక్కు ఉండటం వల్ల సమితి నిర్ణయాలు తరచుగా అడ్డంకులకు గురవుతున్నాయి. ఐరాస చరిత్రలో అనేక ఘట్టాలు విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

1941లో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్, బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌లు కుదుర్చుకున్న అట్లాంటిక్ చార్టర్, 1945లో శాన్‌ఫ్రాన్సిస్కో సమావేశం, యాల్టా సమావేశం- ఇవి ఐరాస పునాదులు. 1947లో ఐరాస పతాకం ఆమోదించబడింది. లేత నీలిరంగు నేపథ్యంపై ప్రపంచ పటం, రెండు ఆలివ్ కొమ్మల మధ్య ఉంచబడింది. ఆలివ్ కొమ్మలు శాంతికి ప్రతీకలు. అధికారిక భాషలు ఆరు: చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్, అరబిక్. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇప్పటివరకు నలుగురు భారతీయులు న్యాయమూర్తులుగా సేవలందించారు: బెనగళ్ నరసింగరావు, నాగేంద్రసింగ్, ఆర్.ఎస్. పాఠక్, దల్వీర్ భండారీ (ప్రస్తుతం కొనసాగుతున్నారు). ఐరాస మానవ హక్కుల పరిరక్షణ, ఆర్థిక- సామాజిక అభివృద్ధి, శరణార్థుల పునరావాసం, శాంతి భద్రతా దళాల ద్వారా వివిధ దేశాలలో శాంతి స్థాపన, అణు నిరాయుధీకరణ వంటి అంశాలలో విశేష కృషి చేసింది. కొరియా, వియత్నాం, ఆఫ్రికా, మధ్యప్రాచ్య సమస్యల్లో శాంతి దళాలను పంపి నష్టాన్ని తగ్గించింది. అయితే విమర్శలూ ఉన్నాయి. తీవ్రవాదాన్ని నియంత్రించడంలో, చిన్న దేశాల సమస్యలను పరిష్కరించడంలో సమితి పరిమితంగా మాత్రమే ఫలితాలు సాధించింది.

అమెరికా, రష్యా, చైనా లాంటి శాశ్వత సభ్య దేశాల ఆధిపత్యం చిన్న దేశాలకు శాపంగా మారింది. సిరియా యుద్ధం, ఉక్రెయిన్- రష్యా ఘర్షణ, పాలస్తీనా సమస్య, కశ్మీర్ సమస్యలో ఐరాస అసమర్థత కనిపిస్తోంది. వీటో హక్కు వల్ల సమితి నిర్ణయాలు తరచుగా అడ్డుకట్టకు గురవుతున్నాయి. 80 ఏళ్లుగా ఐరాస ప్రపంచ శాంతి కోసం చేసిన కృషి విశేషమే అయినప్పటికీ, ఇప్పుడు మరో ప్రపంచ యుద్ధం ముప్పు ముందుకు వస్తోందన్న ఆందోళన పెరుగుతోంది. అణ్వస్త్రాలు కలిగిన దేశాలు పరస్పరం ఢీకొనే పరిస్థితులు ఏర్పడితే మానవ జాతి భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది. ఈ నేపథ్యంలో ఐరాస తన నిజమైన శక్తిని ప్రదర్శించి, కొత్త శాంతి విధానాలను అవలంబించి, సమానత్వం, న్యాయం, సుస్థిర అభివృద్ధి మార్గాలను సూచించాలి. అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందేశం ఒక్కటే- మరో ప్రపంచ యుద్ధం జరగకుండా నిరోధించడం. మానవాళి రక్షణ కోసం, శాంతి నిలుపుదల కోసం ఐరాస తన వనరులన్నీ వినియోగించి, శాంతి ప్రణాళికలను బలోపేతం చేయాలి. ప్రపంచం ఐరాసపై ఉంచిన ఆశలకు కనుగుణంగా, ప్రస్తుత పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం ముప్పును తొలగించి మానవాళిని కాపాడడం దాని ప్రధాన కర్తవ్యం కావాలి.

రామ కిష్టయ్య సంగనభట్ల
9449595494

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News