ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు హతం
ఇద్దరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే
ఘటన స్థలం నుంచి ఎకె47 రైఫిల్ స్వాధీనం
మన తెలంగాణ/హైదరాబాద్/తంగళ్ళపల్లి : మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగి లింది. ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా (63), కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోస దాదా (37) మృతి చెందినట్లు నారాయణపూర్ పోలీసులు ధృవీకరించారు. 40 లక్షల రూపాయల చొప్పున రివార్డు ఉన్న ఈ ఇద్దరు తెలుగు మావోయిస్టులు స్వస్థలం కరీంనగర్ జిల్లా అని వివ రించారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు ఎకె 47 తుపాకీ, ఒక ఇన్సాస్ రైఫిల్, ఒక గ్రనేడ్ లాంఛర్, మావోయి స్టు సాహిత్యం, ప్రచార సామగ్రి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను నిర్వ హిస్తున్న ’దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ’లో మూడు దశాబ్దాలకు పైగా చురుకుగా పాల్గొన్నారన్నారు.
బస్తర్‌లో జరిగిన అనేక హింసాత్మక సంఘటనలకు వారు సూత్ర ధారులని ఎస్‌పి వెల్లడించారు .‘రాజు దాదాను గుడ్సా ఉసేండి, విజయ్, వికల్ప్ అనే మారుపేర్లతో కూడా పిలుస్తారు, అయితే కోసా దాదాను గోపన్న, బుచ్చన్న అని కూడా పిలుస్తారు. ఛత్తీస్‌గఢ్‌లో వారి తలలపై ఒక్కొక్కరికి రూ. 40 లక్షల రివార్డులు ఉన్నాయి‘ అని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, ఏజెన్సీలు ప్రకటించిన నేర చరిత్రలు, రివార్డులకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ‘ఈరోజు, మన భద్రతా దళాలు నక్సలైట్లపై మరో పెద్ద విజయాన్ని సాధించా యి. మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని నారాయణపూర్‌లోని అబుజ్మద్ ప్రాంతంలో, మన దళాలు ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యుడు నక్సల్ నాయకులను – కట్టా రామచంద్ర రెడ్డి, కద్రి సత్యనారాయణను హత మార్చాయి‘ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నుండి నక్సలిజం నిర్మూలించబడు తుందని షా అనేక సందర్భాలలో చెప్పారు. తాజా చర్యతో, ఈ సంవత్సరం ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 249 మంది నక్సలైట్లు మరణించారు. వారిలో, ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్‌లో 220 మందిని నిర్మూలించగా, మరో 27 మంది రాయ్‌పూర్ డివిజన్‌లోని గరియాబంద్ జిల్లాలో కాల్పులు జరిపారు. దుర్గ్ డివిజన్‌లోని మొహ్లా-మన్‌పూర్-అంబాఘర్ చౌకి జిల్లాలో మరో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. సెప్టెంబర్ 11న, రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత సిపిఐ (మావోయిస్ట్) మోడెమ్ బాలకృష్ణ కేంద్ర కమిటీ సభ్యుడు (సిసిఎమ్) సహా పది మంది నక్సలైట్లు మరణించారు. నిషేధిత మావోయిస్టు సంస్థపై నిర్ణయాత్మక కార్యకలాపాలు ఆ సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ తగిలాయని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ పి అన్నారు. ప్రతికూల వాతావరణం ఉన్నప్ప టికీ, బస్తర్‌లోని పోలీసులు, భద్రతా దళాలు తమ నిబద్ధతలో కేంద్ర, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాల దార్శనికతకు, బస్తర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణం గా పనిచేస్తున్నా యన్నారు. కాగా, పార్టీ వారోత్సవాల సమయంలో కీలక నేతలు హతమయ్యారన్న వార్త మావోయిస్టు వర్గాల్లో కలకలం రేపు తోంది.
యువకుడిగా ఉన్నప్పుడే విప్లవ భావాలకు ఆకర్షితుడై మావోయిస్టు పార్టీలో చేరిన కడారి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లె స్వగ్రామమైన కడారి సత్యనారాయణ రెడ్డి యువకుడిగా ఉన్నప్పుడే విప్లవ భావాలకు ఆకర్షితుడై ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు పార్టీలో చేరారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గత 40 ఏళ్ల నుండి ఇంటికి దూరమై విద్యార్థి దశ నుండే అనేక విప్లవ పోరాటాల్లో పాల్గొన్నారని పలు సందర్భాల్లో వచ్చిన వార్తా కథనాలతో తమకు తెలిసిందని వెల్లడిస్తున్నారు. గ్రామానికి చెందిన కడారి కృష్ణారెడ్డి, అన్నమ్మల దంపతులకు రెండో కొడుకు కడారి సత్యనారాయణ రెడ్డి అని మొదటి కొడుకు కడారి కరుణాకర్ రెడ్డి ఎంఈఓ గా పదవీ విరమణ పొందాడని తెలిపారు. పలుమార్లు కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి లొంగిపోయేలా చొరవ చూపాలని సూచించారు. గత తొమ్మిది ఏళ్ల క్రితమే కడారి సత్యనారాయణ తల్లిదండ్రులు చనిపోయారు. తల్లిదండ్రుల మృతి వార్త తెలిసైన స్వగ్రామానికి వస్తాడని పోలీసులు భావించారు. కానీ ఇప్పటివరకు అతను ఎలా ఉంటాడో కూడా తమకు తెలియదని పలుమార్లు కుటుంబ సభ్యులను ఫోటో కూడా పోలీసులు అడిగారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయనపై ప్రభుత్వం రివార్డు కూడా ప్రకటించిందని తెలుపుతున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యునిగా ఎదిగిన ఆయనను చూసేందుకు గ్రామస్తులు ఆసక్తి చూపుతున్నారు ఒకవేళ పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తే ఎన్నో ఏళ్ల క్రితం దూరమైన ఆయన స్వగ్రామానికి చేరుకున్నట్లు అవుతుందని వెల్లడిస్తున్నారు.