సీనియర్ల వేధింపులు తాళలేక ఉరివేసుకొని ఆత్మహత్య
మన తెలంగాణ/బోడుప్పల్: సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో మనస్తాపానికి గురైన ఇంజినీరింగ్ విద్యార్థి హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకు న్న ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లక్కారం గ్రామంకి చెందిన జాదవ్ సాయి తేజ (19) నారపలిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతూ ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉం టున్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు తన తండ్రి ప్రేమ్‌సింగ్ జాదవ్‌కు ఫోన్ చేసి డబ్బులు అడగగా కొంత డబ్బు పంపాడు.
అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో సాయితేజ ఒక సెల్ఫీ వీడియో తీసి తన చావుకి కారణం చిన్నబాబు, కొంతమంది డబ్బు విషయంలో వేధిస్తున్నారని, అలాగే వాళ్ళు తాగిన బార్ బిల్‌ను కట్టించారని, వాళ్ళ వేధింపులు తాళలేకనే చనిపోతున్నానని తెలుపుతూ సెల్ఫీ వీడియో పంపాడు. ఇదే విషయంపై మేడిపల్లి పోలీస్‌స్టేషన్లో ప్రేమ్ సిం గ్ ఫిర్యాదు చేయగా చిన్నబాబు, అతని 8 మంది స్నేహితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, బిఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అంతక్రియల నిమిత్తం అప్పగించామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.