బన్నీ వాస్ నిర్మాణ సంస్థ బీవీ వర్క్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో వస్తున్న ’మిత్ర మండలి’ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం., విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహారా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ‘మిత్ర మండలి’ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. టీజర్, కత్తందుకో జానకి, స్వేచ్చా స్టాండు పాటలకు లభించిన అద్భుతమైన స్పందన తర్వాత.. ‘మిత్ర మండలి’ చిత్ర బృందం మూడో గీతం ’జంబర్ గింబర్ లాలా’ను విడుదల చేసింది.
హైదరాబాద్‌లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగిన ఈవెంట్‌లో ఈ పాటను ఆవిష్కరించింది. లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం చిత్ర బృందంతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. “ఈ సినిమాలో అందరూ కుర్రోళ్లే. అందుకే వీళ్లందరితో కలిసి నటించాలనే ఉద్దేశంతో ఈ సినిమా అంగీకరించాను. నాకు అత్యంత ఆప్తుడు బన్నీ వాసు.. బ్రహ్మానందం ఈ సినిమాలో ఎలాగైనా ఉండాలని, నన్ను తీసుకొచ్చాడు. అందరూ హాయిగా నవ్వుకునే సినిమా తీయాలనే గొప్ప ఆలోచన చేసిన నిర్మాతలు కళ్యాణ్, భాను, విజయేందర్ నా అభినందనలు”అని అన్నారు.
కథానాయకుడు ప్రియదర్శి మాట్లాడుతూ ఈ సినిమా చూసి థియేటర్లలో అందరూ బాగా నవ్వుతారని హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. చిత్ర సమర్పకులు బన్నీ వాసు మాట్లాడుతూ మిత్ర మండలి సినిమా ప్రేక్షకుల ముఖంపై నవ్వులు పూయించడానికే తీస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత విజయేందర్ రెడ్డి తీగల, దర్శకుడు విజయేందర్.ఎస్, సంగీత దర్శకుడు ఆర్‌ఆర్ ధృవన్, నాయిక నిహారిక ఎన్.ఎం, నటులు రాగ్ మయూర్, విష్ణు ఓఐ, ప్రసాద్ బెహారా తదితరులు పాల్గొన్నారు.
Also Read : ‘ప్రాణం ఖరీదు’తో నటుడిగా ప్రాణం పోసుకొని..