* హైదరాబాద్ లో ‘హెచ్‌సీఏ హెల్త్‌కేర్’ జీసీసీ ప్రారంభం
* అమెరికా వెలుపల, భారత్ లో మొట్టమొదటిది ఇదే
* 75 మిలియన్ డాలర్ల పెట్టుబడి…3వేల మందికి కొత్తగా ఉద్యోగాలు
* రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్‌ను ‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘హెచ్‌సీఏ హెల్త్‌కేర్’ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఆయన రాయదుర్గంలో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ‘హెచ్‌సీఏ హెల్త్‌కేర్ ప్రధానంగా అమెరికా, యూకేలలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ సంస్థకు 190 ఆసుపత్రులు, 2,400 కేర్ సైట్లు ఉన్నాయి. మొత్తం 3.16 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఫార్చ్యూన్ 100 కంపెనీ వార్షిక ఆదాయం 70 బిలియన్ డాలర్లు అని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఇలాంటి దిగ్గజ సంస్థ అమెరికా వెలుపల భారత్‌లో తన మొట్టమొదటి జీసీసీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణను ఎంచుకోవడం మనందరికీ గర్వకారణం అన్నారు. ఇది హైదరాబాద్‌కు ఉన్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన మానవ వనరులకు నిదర్శనం అని పేర్కొన్నారు. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో హెచ్ సీఏ హెల్త్ కేర్ 75 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 620 కోట్లు) పెట్టుబడి పెట్టనుందని తెలిపారు.
ఈ జీసీసీ కేవలం ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణలో నాణ్యత, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందన్నారు. ఐటీ, సప్లై చైన్, ప్రొక్యూర్మెంట్, మానవ వనరులు, ఫైనాన్స్, అకౌంటింగ్ తదితర విభాగాల్లో ప్రస్తుతం 1200 మందికి, 2026 నాటికి 3 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్ గ్లోబల్ హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్ రంగాలకు ముఖద్వారంగా ఎదుగుతోందని, ప్రపంచ స్థాయి ఆసుపత్రులు, 800కు పైగా ఫార్మా కంపెనీలు, ప్రముఖ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ జీసీసీలు, అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో గ్లోబల్ హెల్త్ కేర్ హబ్ గా రూపాంతరం చెందుతోందని వివరించారు. అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూనే సరసమైన ఆరోగ్య సంరక్షణను ప్రపంచానికి అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఐటీ సలహాదారు సాయికృష్ణ, హెచ్ సీఏ హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మైక్ మార్క్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎమిలీ డంకన్, హైదరాబాద్ సెంటర్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ అతుల్ కపూర్ తదితరులు పాల్గొన్నారు.
హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రొవైడర్‌గా హెచ్ సి ఏ : హెచ్ సి ఏ హెల్త్‌కేర్ ఓ ప్రముఖ అమెరికన్ హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రొవైడర్‌గా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ కేపబిలిటీ సెంటర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, అనలిటిక్స్ రంగాలలో ప్రతిభావంతులను తీర్చిదిద్దడంపై దృష్టి సారించనుంది. కాగా జీసీసీ, హెచ్ సి ఏ హెల్త్‌కేర్ కెపబిలిటీ సెంటర్ గ్లోబల్ ఆపరేషన్స్‌కు కీలకమైన హబ్‌గా పని చేస్తుంది. టెక్నలాజికల్ ఆవిష్కరణలను ప్రోత్సహించి అధిక నాణ్యత గల హెల్త్‌కేర్ అందించేందుకు ఈ సెంటర్ దన్నుగా పని చేయనుంది. 2025 చివరి నాటికి హెచ్‌సీఏ హెల్త్ కేర్ గ్లోబర్ కేపబిలిటీ సెంటర్ హైదరాబాద్‌లో 75 మిలియన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒక్క ఏడాదిలోనే 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు 2026 నాటికి మరో 3 వేల మందికి జాబ్స్ రానున్నాయి. హెచ్‌సీఏ హెల్త్‌కేర్ అమెరికా, యూకేలో ప్రధాన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. 190 ఆసుపత్రులు, 2,400 కేర్ సైట్లు, 3.16 లక్షల ఉద్యోగులు, వార్షిక ఆదాయం 70 బిలియన్ డాలర్లు హెచ్‌సీఏ హెల్త్‌కేర్ సొంతం.
Also Read: అప్పుడు మాట్లాడింది గుర్తు లేదా..? రెబాపై ఫ్యాన్స్ ఫైర్