అసభ్యమైన మెసేజ్ లు ఇస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని దాదాపు 17 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేయడంలో ఢిల్లీలోని వసంత్ కుంజ్ లో శ్రీ ఎస్ఐఐఎం ఇనిస్టిట్యూట్ అనే విద్యాసంస్థ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని విదేశాలకు తీసుకువెళ్తానని, తన గదికి రమ్మని విద్యార్థినులకు వేధింపులకు పాల్పడడమే కాక, తన మాట వినని పక్షంలో ఫెయిల్ చేయిస్తానని, బ్యాక్ మెయిల్ కు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. స్వామి నుంచి వచ్చిన వాట్స్ యాప్ మెస్సేజ్ లను కూడా విధ్యార్థినులు పోలీసులకు అందజేశారు. పోలీసులు వసంత్ కుంజ్ నార్త్ పోలీసు స్టేషన్ లో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 75(2), 79, 351(2) కింద కేసునమోదు చేశారు. ఆ దొంగస్వామి పరారీలో ఉన్నాడు. అతడు ఆగ్రా సమీపంలో ఉన్నట్లు గుర్తించినట్లు, అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
15 మంది విద్యార్థినులు మెజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలం ఇచ్చారు. పోలీసులు ఇనిస్టిట్యూట్ లోని సిసిటివి ఫుటేజ్ ను ఫోరెన్సిక్ సంస్థ కు పంపారు.ఇనిస్టిట్యూట్ లోని 32 మంది విద్యార్థినుల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. 16 మంది విద్యార్థినులు తమ కు ఎలాంటి సందేశాలు వచ్చాయో,భౌతికంగా జరిగిన ఘటనలు తెలిపారు. విద్యాసంస్థ బేస్ మెంట్ లో వోల్వో లగ్జరీ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానికి నకిలీ నెంబర్ ప్లేట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తాము ఇనిస్టిట్యూట్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పోలీసులకు విద్యార్థినులు ఆరోపించారు. అంతే కాక భయాందోళనలకు గురిచేశారని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.