భారతదేశంలో సోషల్ మీడియా కంపెనీలు నియంత్రణ లేకుండా పనిచేయడానికి అనుమతించే ప్రసక్తిలేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ట్విట్టర్ గా ఉండే సోషల్ మీడియా ఎక్స్ లో సమాచారాన్ని నిరో ధిస్తూ ప్రభుత్వ అధికారులు జారీచేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ, ఎలాన్ మస్క్ కు చెందిన ఎక్స్ కార్పొరేషన్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ ను నియంత్రించడం తప్పని సరి అని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా మహిళలపై నేరాలకు సంబంధించిన సమాచారానని నియంత్రించి తీరాలని పేర్కొంది. లేని పక్షంలో రాజ్యాంగ ప్రసాదించిన పౌరుడి గౌరవహక్కు కు భంగం కలుగుతుందని కోర్టు స్పష్టం చేసింది.ఎక్స్ సంస్థ తన పిటిషన్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 79(3)(బి) ప్రభుత్వ అధికారులకు సమాచారాన్ని నిరోధించే ఉత్తర్వులు జారిచేసే అధికారం ఇవ్వలేదని ప్రకటించాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును కోరింది.
ఆ సెక్షన్ల కింద జారీ చేసిన ఆదేశాలను, దాని ఆధారంగా వివిధ మంత్రిత్వశాఖలు బలవంతపు చర్యలు తీసుకోకుండా నిరోధిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కూడా ఎక్స్ సంస్థ కోరింది. ఈ పిటిషన్ పై చాలా నెలలుగా విచారణ జరిగింది. జూలై నెలలో వాదనలు ముగిశాయి. జూలై 29న హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. నేడు తీర్పు ప్రకటించింది.జస్టిస్ ఎం. నాగ ప్రసన్న ఆ పిటిషన్ ను కొట్టిస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. కమ్యునికేషన్ నియంత్రణ ఎప్పుడూ పాలనా యంత్రాంగానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. సమాచారం, కమ్యునికేషన్ ఎప్పుడూ నియంత్రణకు సంబంధించిన అంశమేనని స్పష్టం చేశారు. అమెరికన్ న్యాయపరమైన తార్కికతను భారతదేశానికి సంబంధించిన విషయాలలో ప్రస్తావించవద్దని జస్టిస్ నాగ ప్రసన్న హెచ్చరించారు.