ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించే లక్షంతో భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లను భారీ స్థాయిలో ఆధునీకరిస్తున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఎబిఎస్‌ఎస్)కింద తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను రూ. 2,750 కోట్ల అంచనా వ్యయంతో ఆధునీకరిస్తున్నారు. ప్రయాణీకుల సౌకర్యాలను ఆదునీకరించడం, ప్రాంతీయ జనాభాకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి ఇవి ఉపయోగపడతాయి. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కూడా ఉంది, వీటి కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. రైలు ప్రయాణ నాణ్యతను తదుపరి స్థాయికి తీసుకువెళ్లడానికి భారతీయ రైల్వేలు ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఎబిఎస్‌ఎస్) చేపట్టింది. రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన అభివృద్ధిని చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణముగా ఈ పనులను చేపట్టారు.
హఫీజ్‌పేట అమృత్ రైల్వే స్టేషన్
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఆధునీకరణ పనులు చేయబడుతున్న 40 రైల్వే స్టేషన్‌లలో హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ ఒకటి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర ప్రాంతంలోని ముఖ్యమైన సబర్బన్ రైల్వే స్టేషన్లలో ఒకటిగానున్న ఈ స్టేషన్ సబర్బన్ గ్రేడ్ -3 (ఎస్.జి-3) గా వర్గీకరించబడింది. ప్రస్తుతం, ఈ స్టేషన్ ప్రధానంగా సబర్బన్ ప్రయాణీకులు, స్వల్ప దూర రైళ్ల ప్రయాణీకుల అవసరాలను తీరుస్తోంది. స్టేషన్‌కు సగటున రోజుకు 9 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ స్టేషన్‌లో దాదాపు 60 ఎంఎంటిఎస్ రైళ్లు , 8 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగుతాయి. హఫీజ్‌పేట స్టేషన్ పశ్చిమాన, ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉండటంతో ఈ స్టేషన్ రోజురోజుకూ దాని ప్రాముఖ్యతను పెంచుకుంటోంది.
పస్తుత స్టేషన్ భవనానికి మెరుగులు దిద్దుతున్నారు. స్టేషన్ ఆవరణ ప్రాంత అభివృద్ధి, 2 లిఫ్టులు, 2 ఎస్కలేటర్ల తో పాటు 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ప్లాట్‌ఫామ్ పై కప్పు అదనంగా ఏర్పాటు, ప్లాట్‌ఫామ్ ఉపరితలాన్ని మెరుగుపరచడం, వెయిటింగ్ హాల్ పునరుద్ధరణ, టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ ఫ్లాట్ ఫామ్ పై కప్పు, సర్క్యులేటింగ్ ఏరియా, స్టేషన్ భవనం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. చివరి దశలో వెయిటింగ్ హాల్ పునరుద్ధరణతో పాటు స్టేషన్ భవనానికి మెరుగులు దిద్దుతున్నారు. ప్లాట్‌ఫామ్ ఉపరితలం మెరుగుదల, లిఫ్ట్‌లు , ఎస్కలేటర్‌లతో పాటు 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వేగంగా జరుగుతోంది. సూచిక బోర్డులు, టాయిలెట్ బ్లాక్‌లు, ముఖభాగం లైటింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. పనులు వేగంగా జరుగుతున్నాయి. ఒకటి లేదా రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.
Also Read: అప్పుడు మాట్లాడింది గుర్తు లేదా..? రెబాపై ఫ్యాన్స్ ఫైర్